తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ సమీక్షలో ప్రధానంగా కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ పైనే చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ సగానికి సగం తగ్గిపోయింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల రిపోర్ట్ 24 గంటల్లో వచ్చేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కొత్తగా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు, ఆక్సిజన్ బెడ్స్ పెంపు కోసం కావాల్సిన నిధులు, భారత్ బయోటెక్‌తో చర్చించి వ్యాక్సిన్ కొనుగోలుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న పడకల విషయంలో డ్యాష్ బోర్డు ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ ఈ సమీక్షలోనూ తుది నిర్ణయం జరిగే అవకాశం కనిపించటం లేదు. కాగా దక్షిణ భారతదేశంలో ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్‌లో ఉన్నాయి. ఏపీలో పేరుకు కర్ఫ్యూ అయినా అప్రకటిత లాక్ డౌన్ కొనసాగుతోంది.