కూతురు చిత్రంతో సినీ రచయితగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు పాటల రచయిత, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పెద్దాడ మూర్తి..కాగా ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. భీముని పట్నంలో జన్మించిన పెద్దాడ మూర్తి తండ్రి పెద్దాడ వీరభద్రరావు నుంచి సాహిత్యాన్ని వంటబట్టించుకున్నారు. కాళీపట్నం రామారావు వంటి ప్రముఖుల రచనలతో స్ఫూర్తి పొందిన ఆయన డిగ్రీ చదువుతున్న సమయంలోనే పతంజలి అనే పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత దిగ్గజ పాటల రచయిత వేటూరిని స్ఫూర్తిగా తీసుకుని రైటర్ కావాలని హైదరాబాద్‌కి వచ్చారు. సినీ వార పత్రికల్లో పనిచేశారు. సూపర్ హిట్, చిత్రం వంటి వీక్లీలో వర్క్ చేశారు. ఆ తర్వాత ప్రముఖ దిన పత్రిక ఆంధ్రజ్యోతిలోనూ కొన్నాళ్లపాటు సినీ జర్నలిస్ట్ గా వర్క్ చేశారు పెద్దాడ మూర్తి.
ఈ క్రమంలో ఆయన పాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కూతురు సినిమాతో రచయితగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. వరుసగా ఆయన రవితేజ నటించిన ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, చిరంజీవి స్టాలిన్, అలాగేచందమామవంటి సినిమాలకు పాటలు అందించారు. చందమామలోని పాటలకు ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.అమ్మానాన్న ఓ తమిళమ్మాయిలో నీవే నీవే.., ఇడియట్లోచెలియా చెలియా.. వంటి పాటలు పెద్దాడమూర్తికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాగేఇష్ట సఖి,హౌస్ ఫుల్అనే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు.పలు టీవీ సీరియల్స్ కూ ఆయన రాసిన పాటలు శ్రోతల ఆదరణ పొందాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న భరత్ మూవీ ‘నాగలి’కి పెద్దాడ మూర్తి మాటలు, పాటలు అందించారు.తారా మణిహారం్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఇది చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించడం విశేషం.
పెద్దాడ మూర్తి సోదరుడు పివిడిఎస్ ప్రకాశ్ కూడా పాత్రికేయుడు, రచయిత. ఆయన గత యేడాది కన్నుమూశారు. ఇప్పుడు ఆయన మరణం కలచివేస్తుంది. ఆయన గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ మంగళవారం పరిస్థితి విషమించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్దాడ మూర్తి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. రేపు(బుధవారం) హైదరాబాద్‌లోని రాజీవ్ నగర్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కొత్త ఏడాదిలో పెద్దాడ మూర్తి మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొదట్లో జర్నలిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన పలు సినిమాలకు పాటలు రాశాడు. తెలుగు భాషపై ఆయనకు మంచి పట్టు ఉంది.