Tuesday, November 26, 2024

పాడి పశువులకు లంపిస్కిన్‌ వైరస్.. ఏజెన్సీలో పశువులకూ సోకుతున్న వ్యాధి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూగజీవాలపై లంపీ స్కిన్‌ వైరస్‌ (ముద్ద చర్మం వ్యాధి) దాడి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు ఈ మహమ్మారి పాకింది. దీంతో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆవులు, ఎద్దులు లంపీ స్కిన్‌ బారిన పడుతుండడంతో పాడి రైతులు ఏం చేయాలో తోచక ఆందోళనలో కూరుకుపోయారు. అకాల వర్షాలు, తెగుళ్లతో పంట నష్టపోయి దిగుబడులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఇప్పుడు లంపీ స్కిన్‌ కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఇప్పటిికే రాష్ట్రంలో పదుల సంఖ్యలో పాడి పశువులు లంపిస్కిన్‌ వైరస్‌ బారిన పడి మృతిచెందాయి.

రాష్ట్రంలోని నిజామాబాద్‌, జగిత్యాల, వరంగల్‌ తదితర మైదాన జిల్లాలతోపాటు ములుగులాంటి ఏజెన్సీ జిల్లాల్లోనూ పశువులకూ లంపి స్కిన్‌ వ్యాధి సోకుతోంది. తెల్ల రంగు ఆవులు/ఎద్దులకు లంపి స్కిన్‌ ఎక్కువగా సోకుతోంది. లంపి స్కిన్‌ వ్యాధి సోకిన పాడి పశువుల్లో జ్వరంతో బాధపడడంతోపాటు మేత మేయకపోవడం, సొల్లు కార్చడం, నీరసంగా ఉండడం వంటి అనారోగ్య లక్షణాలు బహిర్గతమవుతున్నాయి. ఈ అనారోగ్య లక్షణాలు కనిపించిన రెండు రోజుల్లోగా పశువుల చ ర్మంపై బొబ్బలు ఏర్పడి, చర్మం ఉడిపోవడం, పుండ్లు పడడం జరుగుతోందని రైతులు చెబుతున్నారు.

అయితే పాడి పశువులకు లంపిస్కిన్‌ సోకినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటనే సమీపంలోని పశు వైద్యుడిని సంప్రదించి వ్యాక్సిన్‌ వేయించుకోవడంతోపాటు మందులు వినియోగించాలని పశువైద్యశాఖ రైతులకు సూచిస్తోంది. లంపిస్కిన్‌ సోకిన పశువులను మిగతా పశువులకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. తెలంగాణలోని పశువులకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, వైద్యంఅందించడం ద్వారా పశువులను లంపిస్కిన్‌ను నుంచి కాపాడొచ్చని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement