హిందూ మహా సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడుతుందని అధికారులు వెల్లడించారు. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ జనవరి 31 తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఫిబ్రవరి 1 తేదీ నాటికి శ్రీలంక, ఆగ్నేయ బంగాళాఖాతానికి దగ్గరగా వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అల్పపీడన ప్రభావంతో జనవరి 31 తేదీ నుంచి శ్రీలంకతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు రాగల 2 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పూర్తిగా పొడివాతావరణం నెలకొంటుందని అమరావతిలోని వాతావరణ విభాగం తెలియచేసింది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని.. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంటుందని వాతావరణ విభాగం తెలిపింది.