హైదరాబాద్, ప్రభన్యూస్ : రాష్ట్రంలో ఈ నెల పదో తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపలల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, ఖమ్మంలో అతి భారీ వర్షాలు, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఈ రోజు (గురువారం) పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు సమాచారం. ద్రోణి ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇదిలా ఉండగా బుధవారం కర్ణాటకలోని అంతర్గత పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ద్రోణి ఏర్పడి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి వర్షం కురిసింది.