రాజమహేంద్రవరం – జీవితంలో ఒంటరితనాన్ని ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు అనుభవించే ఉంటారు. చేతినిండా సంపాదన ఉన్నా ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. సంతోషం కలిగించే తోడు లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏదో లోటు మనసును కుదురుగా ఉండనివ్వదు. ఇక వృద్ధుల్లో ఆ బాధ వర్ణనాతీతం. చిన్నపిల్లల్లా చెప్పుకోలేరు. అలా అని బాధను దిగమింగలేరు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కొందరు ధైర్యం చేస్తున్నారు. మలివయస్సులో తమ హృదయంతో పెనవేసుకునే బంధం కోసం వెతుకుతున్నారు. అడ్డంకులను దాటుకుని జంటగా ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పెళ్లి బంధంతో కొత్త బంధాలను ఏర్పరుచుకుంటున్నారు.
రాజమహేంద్రవరంలోని ఓ వృద్ధాశ్రమంలో చోటు చేసుకున్న ఘటన పెళ్లికి ఆస్తి-అంతస్తు కాదు తోడు కావాలని నిరూపించింది.
వయసైపోయి వృద్ధాశ్రమంలో ఉన్న వారిద్దరికీ మనసులు కలిశాయి. వయసులో ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఒకరికి ఒకరి తోడు ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. తామిద్దరం ఇష్టపడ్డామని, పెళ్లి చేసుకుంటామని నిర్వాహకులకు చెప్పారు. అంతే, ఆ ఆశ్రమం కళ్యాణమండపంలా సందడిగా మారింది. అక్కడ ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి వారిద్దరినీ ఒకటి చేశారు. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఈ పెళ్లికి వేదికైంది.
వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ(68), రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన మడగల మూర్తి(64) ఇద్దరూ ఈ ఆశ్రమంలో ఉంటున్నారు. రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎవరో ఒకరి సాయం తప్పనిసరి. ఆ సమయంలో రాములమ్మ సహకారంతో మూర్తి కోలుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో గత రాత్రి వీరికి పెళ్లి చేయించారు . ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పండుటాకులు కొత్త జంటకు ఆశీస్సులు అందజేశారు..