గంగామాత తనను దత్తత తీసుకుందని, కాశీ ప్రజల ప్రేమ, ఆప్యాయత తనను ‘బనారస్’గా మార్చిందని మోడీ అన్నారు. ఈ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని అభివర్ణించారు. ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.
కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని ఈ వీడియోలో మోదీ ఉద్వేగపూరితంగా వెల్లడించారు. ఈ ప్రాంతంలో నిర్వహించిన రోడ్‌షోలు, ఆధ్యాత్మిక పర్యటనలు దానిలో మనకు కనిపిస్తాయి. ”2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ(నది) నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించింది. ఈ పదేళ్ల కాలం తర్వాత.. ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను. ఈ సమయంలో కాశీతో నా బంధం దృఢంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాంతం నాది. ఒక తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నాను” అని అన్నారు. అయితే, ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు.
కాగా ఇవాళ గంగనదికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కాశీతో తనకున్న 10 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సాక్షాత్తు ఆ గంగామాతే తనను పిలిచిందని, ప్రతి పనిని భగవంతుని ఆరాధనగా భావించి చేస్తానని తెలిపారు. ప్రజల ప్రేమను చూస్తుంటే తనపై ఉన్న బాధ్యతలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. తన తల్లికి వందేళ్లు నిండిన సందర్భంగా ఆమె పెట్టినరోజుకు వెళ్లినప్పుడు ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. ఎవరి వద్ద లంచం తీసుకోవద్దని, పేదలను మరచిపోవద్దని అమ్మ చెప్పిందన్నారు. తెలివిగా పనులు చేసి, స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని తన తల్లి చెప్పిందని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు.