Wednesday, November 13, 2024

సర్జికల్ స్ట్రైక్స్ర్‌ వల్ల దేశానికే నష్టం.. నల్లధనమంతా ఆరెస్సెస్‌, బీజేపీ ఖాతాల్లోనే : కె. నారాయణ..

అమరావతి, ఆంధ్రప్రభ :సర్జికల్ స్ట్రైక్స్ర్‌ వల్ల దేశానికి జరిగిన నష్టంపై ప్రధాని మోడీ జాతికి సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ డిమాండ్‌ చేశారు. మోడీ విధానాలపైన, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. మోడీ పాలనలో కార్పొరేట్‌ వర్గాలకు మేలు జరిగిందన్నారు. నాడు నోట్ల రద్దుతో 18లక్షల కోట్లను బ్లాక్‌ మనీని మార్చేసుకున్నారనీ, 0.6 శాతం మాత్రమే వృధా అయిందన్నారు. లక్షలాది కోట్ల రూపాయల బ్లాక్‌మనీ ఆరెస్సెస్‌, బీజేపీ ఖాతాల్లోకి చేరిందన్నారు. బొగ్గు ఉత్పత్తిని మోడీ ప్రభుత్వం కావాలనే తగ్గించిందనీ, అదానీకి మేలు చేసేందుకేనని ధ్వజమెత్తారు. ఆస్ట్రేల్రియాలో ఆదానీకి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలున్నాయనీ, జలమార్గం మొత్తం ఆయన వశమైందన్నారు. దేశంలో 14 మంది ప్రధానుల హాయంలో రూ.40 లక్షల కోట్ల అప్పు అయితే, మోడీ ఒక్కరే రూ.80 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. కరోనాలో ప్రైవేట్‌ వైద్యరంగం పూర్తిగా లాభపడిందనీ, ఇప్పుడు ఆరంగంలోకీ, ఆదానీ అడుగెడుతున్నారనీ, అన్ని వైద్య విధాన ఆస్పత్రులను ఆయన గుప్పెట్లోకి తీసుకునెలా మోడీ ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు.

మోడీకి మోకరిల్లిన జగన్‌..

ఏపీ సీఎం జగన్‌ హడావిడీగా ఢిల్లి వెళ్లి ఏం చేశారో ప్రజలకు తెలియడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, మోడీ దగ్గర సీఎం మోకరిల్లడం దురదృష్టకరమని నారాయణ విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, నిధులు అడగలేదని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రకటించిన జగన్‌ ప్రగల్భాలను ప్రజలు నమ్మి 22 ఎంపీలను ఇస్తే ఏం సాధించారంటూ నిలదీశారు. జగన్‌ దిల్లీకి వెళ్లి సాధించింది ఏమీ లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.33 వేల కోట్ల పరిహారం సాధనలో విఫలమయ్యారన్నారు.

వైసీపీ బ్లాక్‌మెయిల్‌కు భయపడేది లేదు..

వైసీపీ చిల్లర నాయకులు నిత్యం నాపైన, సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె. రామకృష్ణపైన వ్యక్తిగతంగా చిల్లరరాజకీయాలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా వైసీపీ బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు విడనాడి, పార్టీ పరంగా ఎదుర్కోవాలని, విమర్శకు ప్రతి విమర్శ చేయాలని సూచించారు. సీపీఐ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ దీటుగా స్పందించాల్సిందిపోయి, విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయాలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలేగాని, వాటిని వదిలి మాఫియాలా తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు సీపీఐ తలవొంచబోదని హెచ్చరించారు. అంబేద్కర్‌ కోనసీమజిల్లా ఘర్షణకు ప్రభుత్వ తప్పిదమే కారణమనీ, అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తోందన్నారు. వైెసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఆత్మకూరులో గెలవడం కాదనీ, అమలాపురం వచ్చి తొడకొట్టాలని సవాల్‌ విసిరారు. సీఎం జగన్‌ దావోస్‌ పర్యటనతో ఏపీకి ఒక్క కొత్త కంపెనీ రాలేదనీ, ఎప్పుడైతే రాజధాని మూడు ముక్కలన్నారో పెట్టుబడి దారులంతా తెలంగాణకు వెళ్లిపోవడంతో అక్కడ సంపద పెరిగిందని, తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చిపడుతోందన్నారు. జగన్‌ విధానాలతో తెలంగాణ, ఢిల్లిలో మోడీ ప్రభుత్వాలే బాగుపడ్డాయని అన్నారు. కులాల వారీ కార్పొరేషన్లు కాదు కావలసింది, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కావాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో అప్పటి కూటమి, రాజకీయ సమీకరణల ఆధారంగా సీపీఐ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement