Monday, November 25, 2024

Delhi: ప్రజాసంపద కొల్లగొట్టి, కార్పొరేట్లకు దోచిపెట్టి.. మోదీపై వ్యవసాయ కార్మిక సంఘం ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రజాసంపదను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ఆరోపించారు. అందుకే ప్రపంచంలోనే రెండవ పెద్ద సంపన్నుడిగా అదానీ అవతరించారని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం 31వ మహాసభల్లో పాల్గొన్న ఆయన, ప్రధాని తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ వద్ద పోగయ్యే లక్షల కోట్ల సంపద దేశ ప్రజలు కోల్పోయిందేనని ఆయన సూత్రీకరించారు. మోదీ అండతోనే అదానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని అన్నారు.

కోవిడ్-19 కష్టకాలంలోనూ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 29 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగిందని, ప్రభుత్వ గోదాముల్లోనూ ఆహార ధాన్యాల నిల్వలు భారీగా ఉన్నాయని, అయినప్పటికీ మార్కెట్లో ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని వెంకట్ అన్నారు. చివరకు ఆహారధాన్యాల మార్కెట్‌ను సైతం కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టుకునే అవకాశం కల్పించారని మోదీపై ఆరోపణలు గుప్పించారు.

అందుకే పండించే రైతుకు సరైన ధర దొరకడం లేదని, ఇటు వినియోగదారులు పెరిగిన ధరలతో సతమతమవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మిక వర్గం మొత్తం కలిసి ‘సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్, సేవ్ ఇండస్ట్రీ’ పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్యాంపెన్లో భాగంగా లక్షలాది మందితో పార్లమెంట్ మార్చ్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement