Friday, November 22, 2024

ఎంఎంటీఎస్‌పై చిన్నచూపు.. నెల రోజుల్లోనే ఐదు సార్లు నిలిచిన సర్వీసు

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగర ప్రజలకు చవకైన రవాణా సౌకర్యాన్ని కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో 2003లో ఎంఎంటీఎస్‌ ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 2లక్షల మంది ప్రయాణికుల లక్ష్యంగా 121రైళ్లను ప్రారంభించారు. కొవిడ్‌ కాలంలో ఏడాది పాటు నిలిచిన ఎంఎంటీఎస్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్దరించేందుకు దక్షిణమధ్య ముందుకురాలేదు. జూన్‌ 2021నుంచి 2022 ఏప్రిల్‌ 11వరకు దశలవారీగా 86 సర్వీసులను మొక్కుబడిగా ప్రారంభించిన రైల్వే శాఖ వాటి నిర్వహణ పట్ల ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గడిచిన నెల రోజుల కాలంలో హైదరాబాద్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌- ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-లింగంపల్లిల మధ్య ఐదుసార్లు రైళ్లను రద్దు చేసింది. నిర్వహణ సరిగ్గా లేదని, పట్టాలు మరమ్మతులో ఉన్నాయని సాకు చూపించి తరుచూ రైలు సర్వీసులను నిలిపివేస్తోంది. తాజాగా వర్షాలు నెపంతో ఈనెల 8నుంచి 13వరకు మొదటి సారీ, 14నుంచి 17వరకు రెండవ సారి 34 రైలు సర్వీసులను నిలిపి వేసింది. రాష్ట్ర ప్ర భుత్వంతో సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా తరుచూ రైళ్లను రద్దు చేయడం వల్ల ప్రయాణీలకు ఇబ్బందులు తప్పడం లేదు.

నిర్వహణ పట్టించేకోని రైల్వేశాఖ ?
ఎంఎంటీఎస్‌ రైళ్ల నిర్వహణను దక్షిణమధ్య రైల్వే పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్యాసింజర్‌ రైళ్లు, గూడ్స్‌రైళ్ల మార్లాల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అఘమేఘాల మీద రిపేర్‌ చేసి సేవలను పునరుద్దరిస్తున్న సంస్థ ఎంఎంటీఎస్‌ పట్ల చిన్న చూపు చూపిస్తుందని తెలుస్తోంది. హైదరా బాద్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌- ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-లింగంపల్లి వరకు 29 రైల్వేస్టేషన్ల పరిధిలో 50కిమీ మేర నగర ప్రజలకు సేవలందిస్తున్న సబర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ను పట్టించుకోకపోవడం పట్ల ప్రయాణి కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎంఎంటీఎస్‌ రైళ్ల నిర్వహణను మెరుగుపరిచి రైలు సర్వీసులను నిపివేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రయాణీకులకు తప్పని పాట్లు
కొవిడ్‌ తర్వాత మొక్కుబడిగా ప్రారంభించిన ఎంఎంటీఎస్‌ సర్వీసుల పునురుద్దరణ పూర్తికాకపోగా వారంలో కనీసం రెండు నుంచి మూడు రోజులు పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. ఎంఎంటీఎస్‌ను నమ్ముకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చిన్నా చితక వ్యాపారాలు చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చీటికి మాటికి రైళ్లను రద్దు చేయడం వల్ల సికింద్రాబాద్‌ – ఫలక్‌నుమా, రామ చంద్రాపురం – లింగంపల్లి వైపు ప్రతిరోజు ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుం టున్నారు. నిర్వహణ సరిగ్గా లేకపోవ డం వల్లే ఆక్యూపెన్సీ రావడంలేదని తెలుస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వే మాత్రం ఇవేమి పట్టించుకోకపోవడంతో ఎంఎంటీఎస్‌కు నష్టాలు తప్పడం లేదని రవాణా రంగ నిపుణులు ఆంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement