Tuesday, November 19, 2024

పొడవైన తీర ప్రాంతం – ఏపీకి మణిహారం : గుడివాడ అమర్నాథ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 972 కి.మీ పొడవైన తీర ప్రాంతమే ఒక వరమని ఆ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన నేషనల్ సాగర్‌మాల అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 10 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు సహా పలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు అందజేసినట్టు వెల్లడించారు. గతంలో చేసిన ప్రతిపాదనలతో పాటు కొత్తగా చేసినవి కలిపి మొత్తం 34 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించినట్టు వివరించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీలకు పోర్టులు, పరిశ్రమలతో వాణిజ్య కార్యకాలాపాలు ఉండేలా తాము ప్రణాళికలు సిద్ధం చేసి, కేంద్రానికి అందజేసినట్టు తెలిపారు. విశాలమైన తీరప్రాంతమే రాష్ట్రానికి మణిహారం అంటూ అభివర్ణించిన మంత్రి, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇప్పటికే సేకరించి ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేసి ఉంచామన్నారు. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన పరిస్థితి, వాతావరణం, ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉన్నాయని తెలిపారు. విశాఖ-చెన్నై, బెంగళూరు – చెన్నై, బెంగళూరు-హైదరాబాద్ పారిశ్రామిక కారిడర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరమైన భూమి సహా అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం చేస్తున్న సంప్రదింపుల ఫలితంగా విశాఖపట్నం, అనంతపురంలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులను కేంద్రం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇదే తరహాలో కడప జిల్లా కొప్పర్తి, కాకినాడలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పోర్టులు, హార్బర్లకు మెరుగైన రోడ్డు, రైలు, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ కల్పించేందుకు చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించినట్టు వెల్లడించారు. అలాగే భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు గురించి కూడా చర్చించినట్టు తెలిపారు. విశాఖ-కాకినాడ మధ్య పెట్రో కెమికల్ కారిడార్లో రూ. 55,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్), హిందుస్తాన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ముందుకొచ్చాయని ఆయన చెప్పారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఇచ్చిన హామీ మేరకు దుగరాజపట్నంకు బదులుగా రామాయపట్నం వద్ద మేజర్ పోర్టు నిర్మించేందుకు ప్రతిపాదించగా, ఆ పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలిపారు. ఇందుకు అవసరమైన భూమి, ఇతర మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. అలాగే భావనపాడు, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధి కోసం కూడా కేంద్రం నిధులు కేటాయించి సహకరించాలని కోరినట్టు తెలిపారు.

తీరప్రాంతాల్లో మత్స్య సంపదను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజిలు, తీరప్రాంత ప్రజల అభివృద్ధి, నైపుణ్యాల కల్పన, ప్రాజెక్టులకు భూమి మరియు నిర్వాసితుల పునరావాసం గురించి కూడా ఈ సమావేశంలో సమగ్ర చర్చ జరిగిందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. సాగరమాల కింద రాష్ట్రాలకు మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని అన్నారు. సువిశాల తీర ప్రాంతం, పుష్కలమైన వనరులు, నైపుణ్యాలు కల్గిన యువత, పట్టుదలతో పనిచేసే ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుస్థిరాభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement