బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వరుస దాడుల్లో ఒక మహిళతో సహా 12 మంది భారతీయులను అరెస్టు చేశారు. వీసా నిబంధనలను ఉల్లంఘించి ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని బెడ్డింగ్, మ్యాట్రెస్ కర్మాగారంలో అక్రమంగా పనిచేస్తున్నారనే ఏజెన్సీల నుండి అందిన సమాచారం ఆధారంగా ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించినట్టు బ్రిటిష్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ (హోమ్) ఒక ప్రకటలో తెలపింది.
ఈ దాడుల్లో బెడ్డింగ్, మ్యాట్రెస్ కర్మాగారంలో అక్రమంగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులను అరెస్టు చేసినట్లు తెలిపింది. సమీపంలోని కేక్ ఫ్యాక్టరీలో వీసా నిబంధనలను ఉల్లంఘించి పని చేస్తున్న మరో నలుగురు భారతీయులను కూడా అధికారులు అరెస్టు చేసినట్లు తెలిపింది. వీసా నిబంధనలను ఉల్లంఘించి ఓ ప్రైవేట్ ఇంట్లో పనిచేస్తున్న మహిళను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారని, దాడులు కొనసాగుతున్నాయని హోం శాఖ తెలిపింది.
వీరిలో నలుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని, వారిని తిరిగి భారత్‌కు పంపించే విషయం పరిశీలనలో ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. 8 మందిని హోం ఆఫీస్‌కు రెగ్యులర్‌గా హాజరు కావాలనే షరతుపై బెయిల్‌పై విడుదల చేసినట్లు ప్రకటన పేర్కొంది. తమ కర్మాగారాల్లో అక్రమంగా కార్మికులను నియమించుకున్నందుకు రెండు ఫ్యాక్టరీలు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హోం శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనల అమలును తనిఖీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు బ్రిటన్ మంత్రి మైఖేల్ టాంలిన్సన్ తెలిపారు.