లోక్ సభలో వాడివేడిగా చర్చ.. వ్యతిరేకించిన విపక్షాలు
బిల్లుకు మద్దతు ఇచ్చిన టిడిపి.జెడియు
బిల్లుపై ఎంఐఎం ఆగ్రహం
జెపిసికి పంపాలని డిమాండ్
ఆంధప్రభ స్మార్ట్ – న్యూఢిల్లీ – వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో పలు ప్రతిపాదనలపై విపక్షాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీని ద్వారా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. . దీనిపై లోక్‌సభలో వాడివేడి చర్చ సాగింది..
విపక్షాలు ఆగ్రహం..
బిజెపి సర్కారు ఎప్పట్నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ బిల్లును తాజాగా విపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ విరుద్ధం అంటూ ఖండించింది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ..” ఈ బిల్లు దారుణం. రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి. ఇది మతపరమైన విభజనను సృష్టిస్తుంది” అని విమర్శించారు. ఈ సవరణ బిల్లును భాజపా మిత్రపక్షం జేడీయూ, టిడిపి సమర్థించింది.
పారదర్శక కోసమే ఈ బిల్లు
కాగా..వక్ఫ్ బిల్లుకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని లాలన్ సింగ్ తెలిపారు. “ఏదైనా సంస్థ నిరంకుశంగా మారినప్పుడు.. దానిని నియంత్రించడానికి, పారదర్శకత కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకత ఉండాలి. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువచ్చాం.” అని స్పష్టం చేశారు.
ఇది ముస్లీంలపై దాడే
యూపీలోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ ఎంపీ మొహిబుల్లా మాట్లాడుతూ.. ఈ బిల్లు ముస్లింలను లక్ష్యంగా చేసుకోబోతోందని అన్నారు. వక్ఫ్ ఆస్తుల బోర్డులో హిందూ సోదరులను చేర్చాల్సిన అవసరం ఏముందన్నారు. హిందువులు, ముస్లింలు లేదా ఏ మతానికి చెందిన వారైనా తమ సంస్థలను నిర్వహించుకునే హక్కు ఉందన్నారు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా మనమే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నామని మండిపడ్డారు. అలాగే ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటికి పంపాలని డిఎంకె నేత కనిమోళి, ఇతర విపక్ష నేతలు కేంద్రాన్ని కోరారు.. దీంతో ఈ బిల్లును పరిశీలన కోసం జెపిసికి పంపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.