Monday, July 1, 2024

Lok Sabha – హిందువులంటే బీజేపీ, ఆరెస్సెస్ మాత్రమే కాదు – రాహుల్ గాంధీ

ఢిల్లీ – భారతదేశ ఆలోచన, రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామని… తాము రక్షణగా నిలబడతామన్నారు. రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్న వ్యక్తులపై దాడి జరుగుతోందని ఆరోపించారు లోక్ స‌భ‌లో విప‌క్ష నేత‌, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాందీ. మోదీ పాలనలో చాలామంది ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విపక్ష నేతలను వేధించడం సరికాదన్నారు.
రాష్ట్ర‌ప‌తి ప్రసంగానికి ధ‌న్యవాత తీర్మానంపై నేడే లోక్ సభలో ఆయన మాట్లాడుతూ… అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. తాను ఈడీ నుంచి 55 గంటల విచారణను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని… గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ, సంపద వికేంద్రీకరణ, పేదలు, దళితులు, మైనార్టీలపై దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన వారిని అణచివేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే తనను విచారణ సంస్థలు విచారించాయన్నారు.

అందరూ హిందువులే…

అయోధ్య రామమందిర సమయంలో కార్పోరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని ఆరోపించారు. తన ఎంపీ పదవిని, ఇంటిని లాక్కున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలను సీబీఐ, ఈడీలతో బెదిరిస్తున్నారని విమర్శించారు. హిందువులంటే బీజేపీ, ఆరెస్సెస్ మాత్రమే కాదన్నారు. సభలో ఉన్నవారు… బయట ఉన్నవారూ హిందువులేనన్నారు. హిందూ సమాజం అంటే మోదీ ఒక్కరే కాదన్నారు. శివుడి ఎడమ చేతిలో త్రిశూలం ఉంటుందని అంటే హింసకు ప్రతిరూపం కాదన్నారు. హింసకు ప్రతిరూపమే అయితే కుడిచేతిలో ఉండేదన్నారు.

భయం, ద్వేషం, అబద్ధాలను వ్యాప్తి చేయడం హిందుత్వం కాదని మహాత్మాగాంధీ చెప్పారన్నారు. మన పూర్వీకులు అంతా భయాన్ని రూపుమాపడం గురించి మాట్లాడారని… కానీ తమను తాము హిందువులుగా చెప్పుకునే వారు హింస, ద్వేషం, అసత్యమే మాట్లాడుతుంటారని మండిపడ్డారు. ప్రతి మతం కూడా ధైర్యాన్ని బోధిస్తుందన్నారు. అయోధ్యలో బీజేపీని ఓడించడం ద్వారా ఆ రాముడు జన్మించిన భూమి దేశానికి మంచి సందేశాన్ని పంపించిందన్నారు.

కొందరికి ఓ సింబల్ అంటే భయమని… అదే అభయహస్తం అని ఎద్దేవా చేశారు. అయోధ్యలో భూములు లాక్కొని విమానాశ్రయం నిర్మించారని విమర్శించారు. అయోధ్య రామాలయం ప్రారంభం సమయంలో అక్కడి బాధితులు దుఃఖంలో ఉండిపోయారన్నారు. ఆలయ పరిసరాలకు కూడా వారిని రానివ్వలేదన్నారు.

- Advertisement -

మణిపూర్‌కు వెళ్లండి

ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపూర్‌కు వెళ్లలేదని విమర్శించారు. మణిపూర్ కూడా మన దేశంలో భాగమేనని వ్యాఖ్యానించారు. మణిపూర్ ఒకసారి వెళ్లాలని సూచించారు. అక్కడి పరిస్థితులు పరిశీలించాలన్నారు. మణిపూర్‌కు ప్రధాని వెళ్లలేదు… హోంమంత్రి కూడా వెళ్లలేదన్నారు. అక్కడి ఘటనలు తన కళ్లముందే ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను పారిపోదల్చుకోలేదని పోరాడుతానన్నారు. కాగా, సభలో రాహుల్ గాంధీ గురునానక్ ఫొటోను ప్రదర్శించారు. ఫొటోను ప్రదర్శించడం నిషేధమని స్పీకర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement