Thursday, July 4, 2024

Lok Sabha రాహుల్ వ్యాఖ్య‌లు రికార్డ్ ల నుంచి తొల‌గింపు….

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్ర‌తిపక్షం తరఫున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అగ్నివీర్‌, మైనార్టీ తదితర అంశాలపై మోదీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే స్పీకర్‌ ఆయనపై చర్యలు తీసుకున్నారు.
రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. సభాపతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, అగ్నివీర్‌, మోదీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం పేర్కొంది.

హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌

‘జై సంవిధాన్‌’ అంటూ చర్చను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ దాదాపు ఒక గంట 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు అధికార పక్షం నుంచి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పదేపదే అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ కూడా రెండుసార్లు ప్రసంగాన్ని అడ్డుకుని రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఈసందర్భంగా సభలో కొన్ని మతపరమైన ఫొటోలను రాహుల్‌ చూపించారు. దీనిపై అధికారపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. ఈ వివాదానికి గానూ ఆయన క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.

- Advertisement -

నేను చెప్పిన‌వ‌న్సీ వాస్త‌వాలే…..

తన స్పీచ్‌లోని వ్యాఖ్యలు తొలగించటంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘మోదీ ప్రపంచంలో మాత్రమే నిజాన్ని తొలగిస్తారు. కానీ, వాస్తవ ప్రపంచంలో నిజం ఎప్పుడూ తొలగించబడదు. నిన్న లోక్‌సభలో నేను చేసిన వ్యాఖ్యలు అన్నీ నిజాలు, అసత్యాలు. వాళ్లు తొలగించుకోవాలనుకుంటే.. తొలగించుకోవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement