ఢిల్లీ – లోక్‌సభ స్పీకర్‌గా భాజపా ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఓం బిర్లాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు స్పీకర్‌గా ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
స్పీకర్ స్థానంలో ఓం బిర్లాను కూర్చొబెట్టిన అనంతరం మోదీ సభలో మాట్లాడుతూ, బిర్లాపై ప్రశంసలు కురిపించారు. సభ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూడడంలో బిర్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
రాబోయే ఐదేళ్ల పాటు మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. మీ మధురమైన చిరునవ్వు సభ మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుందని ప్రశంసల జల్లు కురిపించారు. మీరు రెండవసారి స్పీకర్ పదవికి ఎన్నిక కావడం గౌరవప్రదమైన విషయం అని బిర్లాను అభినందించారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో జరగని పనులు మీ అధ్యక్షతన ఈ సభ వల్లే సాధ్యమయ్యాయని ప్రధాని అన్నారు. కీలక బిల్లులు మీ నాయకత్వంలో ఆమోదం పొందాయని.. ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లు వచ్చాయని తెలిపారు. 17వ లోక్‌సభ సాధించిన విజయాల గురించి దేశం గర్విస్తుందని తనకు చాలా నమ్మకం ఉందని మోదీ పేర్కొన్నారు..