Friday, November 22, 2024

Lok Sabha – ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా వంద సీట్లు లోపే – కాంగ్రెస్ పై మోదీ కౌంట‌ర్

తమకు దేశం మొదటి ప్రాధాన్యత అని అన్నారు. విపక్ష నేతలు మణిపూర్‌పై చర్చించాలని పట్టుబడుతున్నా, లోక్‌సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ, ప్రధాని మోదీ తన విమర్శల దాడిని కొనసాగించారు. అవినీతిని అసలు సహించేది లేదని చెప్పారు. ప్రజలు తమను మరోసారి ఎన్నుకున్నారని, కొంతమంది బాధను తాను అర్థం చేసుకోగలనని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ఈ రోజు పార్లమెంట్‌లో ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

తమకు దేశం ముఖ్యమని, ఏ విషయంలోనైనా దీన్నే ప్రాధాన్యతగా తీసుకుంటామని చెప్పారు. ఎన్ని కుట్రలు ఆరోపణలు చేసినా, విపక్షాలు ఓడిపోయాయన్నారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాలను నమ్మి తమను మూడోసారి దేశ ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. దేశ ప్రజలు సెక్యులరిజం కోసం ఓటేసి మమ్మల్ని గెలిపంచారని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరించారని చెప్పారు.

- Advertisement -

2014 నాటికి ముందు దేశ ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని, దేశం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని, అలాంటి సమయం 2014కి ముందే ఉందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ వార్తపత్రిక చూసిన కుంభకోణాలే కనిపించేవని ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగాయని అన్నారు. 2014కి ముందు టెర్రరిస్టులు ఎక్కడికైనా వచ్చి దాడులు చేసేవారని, అమాయకుల్ని చంపారని అన్నారు. ఇప్పుడు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి హతమారుస్తున్నామని, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేశామని చెప్పారు.

ఇక రాహుల్ గాంధీపై మోడీ విరుచుకుప‌డ్డారు….543 మార్కులకు 99 మార్కులే తెచ్చుకున్నారంటూ విమ‌ర్శించారు.
2024 లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మూడో అతిపెద్ద పరాజయం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చొవాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలోపే పరిమితమైందని సెటైర్ వేశారు. ప్రజల నిర్ణయంపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా కాంగ్రెస్ నేతలు ఇంకా చిన్నపిల్లలానే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఎన్డీఏను ఓడించామని భావిస్తున్నారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) సంతోపడుతున్నాడు. కానీ వచ్చింది 100కు 99 మార్కులు కాదని 543కు 99 మార్కులు వచ్చాయని ఎద్దేశా చేశారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లు వచ్చాయని అన్నారు.

సున్నా సీట్లు వచ్చినా.. కాంగ్రెస్ వాళ్లు హీరోల్లా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. పరాజయాల్లో కాంగ్రెస్ పార్టీ రికార్డ్ సృష్టించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేరుగా పోటీ పడ్డ స్థానాల్లో కాంగ్రెస్ స్ట్రైయిక్ రేట్ కేవలం 26 పర్సంటేనని అన్నారు. గుజరాత్, ఛత్తీస్ గఢ్‌, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలిచింది కేవలం రెండు స్థానాలేనని గుర్తు చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సారి బీజేపీ ప్రజల ప్రేమను పొందిందని, ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్పీప్ చేసిందని పేర్కొన్నారు. కర్నాటక, యూపీ, తమిళనాడు, రాజస్థాన్‌లోనూ బీజేపీ ఓటు శాతం పెరిగిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement