Thursday, July 4, 2024

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా

18వ లోక్‌సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. జూలై 24న ప్రారంభమైన 18వ లోక్‌సభ తొలి సెషన్‌ వేడెక్కింది. ఈ సమావేశాల్లో నీట్ వివాదం, మణిపూర్ అల్లర్లపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.

- Advertisement -

మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. స్పీకర్ ఆదేశాలతో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించడం కలకలం రేపింది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ఈడీ, సీబీఐ దాడులతో మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధిస్తుందని రాహుల్ విమర్శించారు. ఎన్డీయే హయాంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు విపక్షాల విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల కూటమి అబద్ధాలు ప్రచారం చేసినా ఓటమి తప్పలేద‌ని ఎద్దేవా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ దశాబ్దంలో భారత్ ఖ్యాతి పెరిగిందని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్‌ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని స్పష్టం చేశారు. నేషన్‌ ఫస్ట్‌ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సభలో నిన్న, ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారని, వీరిలో కొందరు తొలిసారి ఎంపీలు అయినవారు కూడా ఉన్నారని తెలిపారు.

నూతన సభ్యుల ప్రమాణం

ఈ సెషన్‌లో తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జరగ్గా, ఆపై ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో ప్రమాణం చేయించారు. లోక్‌సభ నూతన స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement