సార్వత్రిక ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. శనివారం చివరి విడత పోలింగ్ పూర్తికాగానే ఫలితాల కోసం ఉత్కంఠ కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనుండడంతో ఆ రోజున యావత్ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంది. కానీ ఫలితాలు థియేటర్లలో ప్రసారమైతే? వాటిని లైవ్‌లో ప్రదర్శిస్తే? మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఇప్పుడు ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముంబయిలోని ఎస్ఎం5 కల్యాణ్, సియాన్, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్ థియేటర్లు, ఠాణెలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, పుణెలోని మూవీమ్యాక్స్ తదితర థియేటర్లు జూన్ 4న ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్‌ను ప్రారంభించారట. ఆరు గంటల పాటు ఫలితాలను థియేటర్లలో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారట. ఇందుకోసం టికెట్ ధరలు రూ.99 నుంచి మొదలుకొని రూ.300 వరకు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫలితాల ప్రదర్శనకు హౌస్‌ఫుల్ అయినట్లు తెలుస్తోంది. టికెట్ బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను కొందరు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.