లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. సెకండ్ లిస్టులో 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులనే ప్రకటించింది. ఈసారి మాత్రం రెండు రాష్ట్రాల ప్రస్తావన లేదు.ఇక మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌కు కంచుకోట అయిన చింద్వారా నుంచి ఆయన కుమారుడు నకుల్‌నాథ్ పేరును ప్రకటించారు.
మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి 43 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అభ్యర్థులను వెల్లడించింది. తొలి జాబితాలో 39 మందిని ప్రకటించగా.. సెకండ్ లిస్టులో మాత్రం 43 మందిని ప్రకటించింది. 43 మందిలో జనరల్ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా.. 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు..
అసోంలోని జోర్హాట్ నుంచి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పోటీ చేయనున్నారు. నకుల్ నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నుంచి పోటీ చేయనున్నారు. రాహుల్ కస్వా రాజస్థాన్‌లోని చురు నుంచి, వైభవ్ గెహ్లాట్ రాజస్థాన్‌లోని జలోర్ నుంచి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లోని భింద్ నుంచి ఫూల్‌సింగ్ బరయ్య పోటీ చేయనున్నారు.