Tuesday, November 26, 2024

విశాఖ, అనంతపురంలో లాజిస్టిక్ పార్కులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, అనంతపురం ప్రాంతాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ వెల్లడించారు. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వివిధ రాష్ట్రాల్లో మొత్తం 35 ప్రదేశాలను గుర్తించి మల్టీ మెడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తోందని వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. నేషనల్ లాజిస్టిక్ పాలసీని కేంద్ర కేబినెట్ ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్ సమర్ధత పెంచి వ్యయాన్ని తగ్గించడం నేషనల్ లాజిస్టిక్ పాలసీ ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.

పూర్తిస్థాయి లాజిస్టిక్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్ ఖర్చును గణనీయంగా తగ్గించడం ఎన్ ఎల్ పీ-2022 సమగ్ర ఎజెండా అని మంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం సమర్థవంతమైన లాజిస్టిక్ సెక్టార్ అవసరమని అన్నారు. మొత్తం జీడీపీలో లాజిస్టిక్ సెక్టార్ వాటాకు సంబంధించిన  వివరాలు ప్రస్తుతం లేనప్పటికీ రైల్వే, రోడ్డు రవాణా, జల రవాణా, వాయు రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవలు ఇతర లాజిస్టిక్ సెక్టార్ల జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 2018-19లో 1,71,75,128 కోట్లు, 2019-20 లో 1,83,55,109 కోట్లు, 2020-21లో 1,80,57,810 కోట్లు ఉందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement