ఏలూరు, ప్రభన్యూస్ : ఏలూరు జిల్లాలో బీమడోలు మండలం పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ ఘటన బుధవారం జరిగింది. దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన మద్దిపల్లి అప్పారావు చైన్ స్కాచింగ్ కేసులో స్టేషన్లో ఉంచారు. నిందితుడు స్టేషన్లో బాత్రూమ్కి వెళ్లి అక్కడ ఉన్న కర్టయిన్తో కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రూమ్కి వెళ్లిన అప్పారావు ఎంత సేపటికీ రాకపోవడంతో పోలీసులు బాత్రూమ్ డోరు బద్దలుకొట్టగా కొనఊపిరితో ఉన్న అతడిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి కేసు నమోదు చేశారు.
ఆస్పత్రి వద్ద ధర్నా…
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతి చెందిన అప్పారావు కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులు మద్దిపల్లి నాగేశ్వరావు, నాగమణి, భార్య స్వాతి, బాధిత కుటుంబం యొక్క బంధువులు ఆందోళన చేశారు. తమ కుమారుడిని పోలీసులు కొట్టి చంపేశారని, ఆత్మహత్య చేసుకోలేదని వారు వాపోయారు. అరెస్ట్ చేసిన తరువాత కోర్టుకి పంపకుండా మూడు రోజుల నుండి స్టేషన్లో ఎందుకు ఉంచారని పోలీసులను నిలదీశారు. నా భర్త ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, పోలీసులే చంపేసారని భార్య స్వాతి ఆవేదనతో చెప్పింది. భర్త మృతితో కుటుంబం రోడ్డు పాలైందని, పోషించే నాధుడు లేడని వాపోయింది. పోతునూరు గ్రామస్తులు ఏలూరు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. తగిన న్యాయం చేయాలని నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి ఎస్పి రాహుల్ దేవ్ శర్మ వచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..