Friday, November 22, 2024

అప్పుల ఊబిలో అన్న‌దాత‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పేరుకు మాత్రమే దేశానికి అన్నం పెట్టే రైతు.. కష్టం, నష్టం ఏదొచ్చినా వెనుకాడకుండా చెమటోడ్చి పంట పండిస్తూ, మేమున్నామంటూ దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న కర్షకుడికి చివరకు కన్నీళ్ళే మిగులుతున్నాయి. ఇంట్లో చిల్లిగవ్వ లేకపోయినా, తనకు బ్యాంకులో రుణం లేదంటూ తలెత్తుకు తిరిగే రోజులు మాయమయ్యాయి. తరతరాలుగా నమ్ము కున్న పొలంలో ఆరుగాలం ఎంత కష్టనడినా, సర్కారు తనవంతు సాయం చేసినా.. తనకున్న అప్పు జీవిత కాలంలో తీరదన్న మనోవేదన నేడు వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంతో గడిచిన ఐదారేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతూ బ్యాంకుల్లో తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేదు. చక్రవడ్డీ, బారువడ్డీలు కలిపి ఇప్పడు తడిసి మోపెడైన రుణ మొత్తాలను చెల్లించేందుకు ఏ మార్గమూ వారికి తోచడంలేదు. ఈ క్రమంలో యేటా నాలుగైదు సార్లు బ్యాంకు నోటీసులు అందుకోవడం వారి వంతమింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చే ప్రభుత్వం మాఫీ చేస్తుందిలె.. అన్న భరోసా లేని ధీమా ఒక్కటే రైతులకు మిగిలింది. ఈ క్రమంలో లక్షలాది మంది రైతులు గ్రామాల్లో తనకున్న పరపతిని పోగొట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఒకప్పుడు పంటలమ్మిన కొద్ది రోజుల్లోనే బ్యంకు రుణాలు తీర్చి మిగిలిన దాంట్లో సంతోషంగా ఉండే రైతు కుటుంబాల్లో గత కొన్నేళ్ళుగా అప్పుల కుంపటి రాజుకుంది. పాత రుణం తీరక.. కొత్త రుణం పుట్టక.. సీజన్‌ వచ్చిందంటే చాలు, నానాతంటాలు పడాల్సిన దుస్థితి వారిని వెంటాడుతోంది. అందుకుతోడు పండించిన పంటలకు మద్దతు ధరలందక సమస్యలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వమిచ్చే పంట పెట్టుబడి ఏటా ఎకరాకు రూ.10 వేలు.. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ, అనుబంధ సమస్యలు అంతకు పది రెట్లు పెరిగాయి. సహకార సంఘాలు, గ్రామీణ, జాతీయ బ్యాంకులు.. ఎక్కడ చూసినా పేరుకుపోయిన రుణాలు, వాటిపై వడ్డీలు నిత్యం ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సరాసరిగా ఉన్న 70 లక్షల రైతు కుటుంబాల్లో దాదాపు 90శాతం డిఫాల్టర్లేనని ఇప్పటివరకు అనేక సర్వేలు తేల్చాయి. ఇదే విషయాన్ని ప్రతియేటా రెండు పర్యాయాలు జిల్లా లీడ్‌ బ్యాంకుల ద్వారా అందిన సమాచారంతో కూడిన నివేదికలను ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు ఆర్బీఐకి సమసర్పిస్తున్నారు. పండించిన ఏ పంట కూడా గిట్టుబాటు కాకపోవడంతో రుణాలు చెల్లించేందుకు రైతుకు మార్గం తోచడం లేదు. అదే సమయంలో వసూలు చేసేందుకు బ్యాంకర్లకు కూడా మార్గం లేకుండా పోయింది. గతంలో ఉండే పదహారు రకాల సబ్సిడీ రుణాలు రైతులకు పూర్తిగా దూరమయ్యాయి.

యేటా సీజన్‌లో ప్రైవేటు అప్పులే దిక్కు
పంట రుణాల కోసం రైతులు నానా అగచాట్లు- పడుతున్నారు. సాగు పెట్టు-బడుల కోసం అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి తోడూ వివిధ సాకులు చెబుతూ బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు యాసంగిలో పంట రుణాలు అరకొరగానే ఇచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతియేటా లక్ష్యాలు నిర్ధేశించుకుంటున్నప్పటికీ, ఎక్కడా టార్గెట్‌ పూర్తికావడం లేదు. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం చేసినా.. ఆ మొత్తాలను బ్యాంకులు వడ్డీకింద జమచేసుకుంటున్నాయి. కొత్తగా పంట రుణాలు ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ క్రమంలో రైతులకు ప్రైవేటు- అప్పులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.వందకు రూ.2-5 దాకా వడ్డీ చెల్లించేలా ఒప్పంద పత్రాలు రాసి భూములను తాకట్టు- రిజిస్ట్రేషన్‌ చేయిస్తేనే ప్రైవేటు- వ్యాపారులు రైతులకు రుణాలిస్తున్నట్లు- తెలంగాణ రాష్ట్ర ఉపశమన కమిషన్‌ అధ్యయనంలో తేలింది.

ఇదీ.. గత ఏడాది రుణాల దుస్థితి?
ఈ సీజన్‌లో రూ.27 వేల కోట్లను పంటరుణాలుగా ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించింది. రుణాలను వేగంగా ఇస్తే సాగు పెట్టు-బడులకు రైతులకు ఉపకరిస్తాయని తెలిపింది. క్షేత్రస్థాయిలో బ్యాంకులు సవాలక్ష కొర్రీలతో పంటరుణాలను సక్రమంగా ఇవ్వడం లేదు. గత సీజన్‌ ప్రారంభమయ్యాక అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ పంటకాలం పూర్తయినా రూ.9 వేల కోట్ల వరకే రుణాలు ఇచ్చినట్లు- సర్వేలో తేలింది. గత జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లోనూ నిర్దేశిత లక్ష్యం రూ.40,718 కోట్లలో రూ.23,793.15 కోట్లు- (58.43 శాతమే) బ్యాంకులు పంపిణీ చేశాయి. గతేడాది(2021) వానాకాలం సీజన్‌లో రూ.24,898.25 కోట్లు- ఇవ్వగా ఈ ఏడాది వానాకాలంలో అంతకన్నా రూ.1,105 కోట్లు- తక్కువగా పంపిణీ చేయడం గమనార్హం.

- Advertisement -

అమలుకు నోచుకోని రిజర్వు బ్యాంకు ఆదేశాలు
పంటరుణం తీసుకునే రైతుల నుంచి రూ.లక్షన్నర వరకూ పూచీకత్తు అడగరాదని రిజర్వుబ్యాంకు గతంలో బ్యాంకులను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పలు బ్యాంకులు దీన్ని అమలుచేయడం లేదు. రైతు నుంచి పట్టాదారు పాసుపుస్తకం తీసుకున్నాకే పంటరుణం ఇస్తున్నాయి. దీనికితోడు ధరణి పోర్టల్‌లో రైతు రెవెన్యూ ఖాతాను తెరిచి పంటరుణం ఇచ్చినట్లు- నమోదు చేసి అకౌంట్‌ను స్తంభించి(ఫ్రీజ్‌) చేస్తున్నాయి. ఆపై రుణం తీసుకున్న భూమిని ఎవరికీ అమ్మకూడదని స్పష్టం చేస్తున్నాయి. పంటరుణం తీసుకున్నాక ఇలా ఫ్రీజ్‌ చేసే అవకాశం ధరణిలో తమకు రావడం లేదంటూ కొన్ని బ్యాంకులు అప్పుల పంపిణీ ఆలస్యం చేస్తున్నాయి. ధరణి పోర్టల్‌ను తాము వినియోగించుకుని పంటరుణం ఇచ్చాక.. రైతు భూమి రెవెన్యూ ఖాతాను ఫ్రీజ్‌ చేసే సదుపాయం కల్పించాలని బ్యాంకర్లు రాష్ట్ర రెవెన్యూశాఖను కోరారు. అయినా సకాలంలో రుణాలను ఇవ్వలేకపోయారు. కొందరు రైతులు గతంలో పంటరుణం తీసుకున్నప్పుడు చూపిన భూమి విస్తీర్ణంకన్నా ధరణి పోర్టల్‌లో తక్కువగా కనిపిస్తోందని, వివరాలు సరిగా లేవని రుణాలివ్వకుండా తిరస్కరిస్తున్నారు. పాత రుణం చెల్లించి రెన్యువల్‌ చేసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదని, రుణమాఫీ చేసేదాకా వచ్చేది లేదని చెపుతున్నారని ఆయన వివరించారు.

రాష్ట్రంలో సింహభాగం చిన్నరైతులే
రాష్ట్రంలో గత వానాకాలంలో 68 లక్షల మంది రైతులకు కోటీ- 36లక్షల ఎకరాల భూములున్నట్లు- వ్యవసాయశాఖ తాజాగా లెక్కలు తేల్చింది. వీరిలో ఎస్సీలు 8.54లక్షల మందికి 13.53లక్షల ఎకరాలు, గిరిజనులు 8.23లక్షల మంది వద్ద 19.29లక్షల ఎకరాలు, బీసీలు 34.81లక్షల మందికి 71.47లక్షల ఎకరాలున్నట్లు- ఈ శాఖ వివరించింది. వీరిలో అత్యధిక శాతం పేదరైతులేనని గుర్తించింది. రాష్ట్రంలో 16 లక్షల మందికి ఇంతవరకూ బ్యాంకులు ఒక్కసారి కూడా పంటరుణాలు ఇవ్వనందున అధిక వడ్డీలకు ప్రైవేటు- అప్పులే తీసుకుని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ లెక్కలు తీసుకున్నప్పుడు 36.68 లక్షల మందికే బ్యాంకులు రుణాలివ్వగా వీరిలో 5.66 లక్షల మంది రుణాల సొమ్మును ప్రభుత్వం బ్యాంకులకు తిరిగి చెల్లించింది. మిగిలిన 31 లక్షల మందిలో చాలామంది పాతరుణం కట్టి కొత్తగా తీసుకోవడం లేదని వారిని ఎగవేతదారుల జాబితాల్లో బ్యాంకులు చేర్చడం రుణాల పంపిణీ చాలా తక్కువగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement