హైదరాబాద్, ఆంధ్రప్రభ : పోలీసుల నిఘా, నియంత్రణతో కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న లోన్ యాప్ సంస్థలు మళ్లి విజృంభిస్తున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని అందినంత దండుకునేందుకు వేర్వేరు మార్గాలలో ప్రయత్నిస్తున్న సంస్థలు ఉచ్చులోపడిన వారి రక్తమాంసాలను తింటూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రుణ యాప్ సంస్థలు ఈ సారి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని తమ దోపిడీకి తెరతీశాయి. చదువుకునే విద్యార్థులను టార్గెట్ చేసి వారికి లోన్లు ఇచ్చి అధిక వడ్డీలు గుంజుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు క్రెడిట్ కార్డులంటూ హ్యాండ్ లోన్ పేర్లతో డబ్బులను పంపించి లోబరచుకుంటున్నాయి. ఇక్కడి నుంచే ఆ సంస్థలు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. రుణం తీసుకొని కట్టలేని విద్యార్థులకు బతికి ఉన్నప్పుడే నరకాన్ని చూపిస్తున్నాయి.
ఇచ్చిన రుణానికి నాలుగింతల డబ్బులు చెల్లించినప్పటికీ మరింత డబ్బు బాకీ ఉన్నారంటూ టార్చర్ పెడుతున్నాయి. విసిగిపోయిన విద్యార్థులు ఏదైతే అది అవుతుందన్న అభిప్రాయంతో ఉంటే వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేసిన నిర్వాహకులు నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. బెంగళూరుకు చెందిన స్లైస్ యాప్ సంస్థ ఇటువంటి ఆగడాలకు పాల్పడుతున్నట్లు సీసీఎస్ పోలీసులకు గడచిన వారం రోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్లెస్త్ యాప్ ఆగడాలపై ఇప్పటికే పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..