భారతమాతకు హారతి అంటే.. దేశంలోని 130 కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపడమేనని, కులం, మతం, వర్గం, వర్ణం, జిల్లా, భాష పేరుతో జనాన్ని చీల్చే శక్తులు, వ్యక్తులను దూరం పెట్టాలన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు. ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్, పీపుల్స్ ప్లాజాలో జరిగిన భారతమాతకు హారతి కార్యక్రమంలో ప్రసంగించారు. మనమంతా భారతమాత పుత్రులయని తెలియజేయడానికి.. మనమంతా ఒక్కటే అనే సంకల్పంతో నిర్వహిస్తున్నదే ‘భారతమాతకు మహాహారతి’ కార్యక్రమం అన్నారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మర్చిపోకూడదు.. మర్చిపోతే వాడు మానవుడే కాదన్నారు.
మన చరిత్రలో ఎప్పుడూ ఇతరులపై దండెత్తలేదని, శాంతి, అహింస మన రక్తంలో ఉందని, దేశ సంపదను, సంస్కృతిని బ్రిటీష్ వారు దోచుకున్నారని ఉద్ఘాటించారు. రాణిరుద్రమ్మ, ఝాన్సీలక్ష్మీబాయ్, కొమురంభీమ్, అల్లూరి సీతారామారాజు వంటి వారి జీవిత చరిత్రలను చరిత్ర పుట్టలోకి ఎక్కించాలని, మహనీయుల జీవితాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.