అమెరికా కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ లో సిలికానాంధ్ర సంస్థ వారు ఈరోజు (ఆదివారం) సమైక్య సాహితీ అధ్యక్షుడు, కవి, రచయిత, వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్ ను ఘనంగా సన్మానించారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగిన సిలికానాంధ్ర 22వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్.. మాడిశెట్టిని సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సాహిత్య కార్యక్రమాల నిర్వాహకుడిగా మాడిశెట్టి సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా వివిధ రంగాలలో మాడిశెట్టి చేస్తున్న కృషి స్ఫూర్తి దాయకం అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత నటుడు కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా ప్రదర్శించిన శ్రీనాథుడు పద్యనాటకం అందరినీ అలరించింది. కార్యక్రమం లో సినీ నటుడు ప్రదీప్ సోదరుడు దిలీప్, సిలికానాంధ్ర సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాడిశెట్టి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న సిలికానాంధ్రలో జరిగిన సన్మానం సంతోషమన్నారు. మాడిశెట్టి కి పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ జివి శ్యాం ప్రసాద్ లాల్, తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ డి. శ్రీనివాస్, బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి, సాహితీ గౌతమి అధ్యక్ష కార్యదర్శులు నంది శ్రీనివాస్, కొత్త అనిల్ కుమార్, సమైక్య సాహితి సహాధ్యక్షుడు డాక్టర్ బి వి ఎన్ స్వామి, ప్రధాన కార్యదర్శి కె ఎస్ అనంతాచార్య, స్తంభం కాడి గంగాధర్, డాక్టర్ ఎస్ వేణుశ్రీ, అన్నవరం దేవేందర్, వారాల ఆనంద్, డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కందుకూరి అంజయ్య తదితరులు అభినందనలు తెలిపారు..