హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి దాటాక కూడా మద్యం దొరకనుంది. బార్లలో ఆర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు ఆబ్కారీ శాఖ అనుమతించింది. శని, ఆదివారాల్లో ఒంటి గంట వరకు, మిగతా ఐదు రోజుల్లో ఇకపై అర్ధరాత్రి 12 గంటల వరకు యధేచ్చగా మద్యం విక్రయాలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకు బార్లలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అదనంగా మరో గంటపాటు ఆహారపదార్ధాలు అమ్ముకునేందుకు అవకాశం ఉంది. దీనిని పొడిగించాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆబ్కాకీ శాఖ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో బార్లు ఇకపై నిర్విరామంగా 15 గంటలపాటు మద్యం విక్రయాలను కొనసాగించనున్నాయి. ఇకపై ఫోర్ స్టార్, ఆపై హోటళ్లు, బార్లకు 25 శాతం అదనపు రుసుమును వసూలు చేయనున్నారు.
ఇప్పుుడున్న 850కిపైగా బార్లు, పబ్‌లు, టూరిజం, క్లబ్‌లలో ఈ మేరకు ఈ నిబంధనలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది ఆబ్కారీ శాఖ అధికారులు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అర్ధరాత్రి వరకు బార్ల నిర్వహణపై కీలక ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇందులో ముంబాయి, పూణే, నాగపూర్, నాసిక్, ఔరంగాబాద్, చెన్నై, ఒడిశా, హరియానా, డిల్లి రాస్ట్రాల్లో అమలులో ఉన్నట్లుగా తెలంగాణలోనూ బార్లను అర్ధరాత్రి 12 గంటలవరకు అనుమతించాలని నివేదిక ఇచ్చారు. దీనిపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఐదు రోజులు అర్థరాత్రి 12 గంటలవరకు, వీకెండ్ రోజుల్లో అర్ధరాత్రి దాటాక ఒంటిగంట వరకు నిబంధనల అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది.
మరిన్ని ఎలైట్ బార్లు…
త్వరలో ఎలైట్ కొత్త బార్లకు యధేచ్చగా అనుమతులు జారీ చేయనున్నారు. ఆబ్కారీ శాఖ మంత్రికి ఈ విషయంలో ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. జనాభాకు తగ్గట్లుగా బార్లకు అనుమతులు ఇవ్వాలని ఆబ్కారీ ముసాయిదాలోనే ఉంది. ఇప్పుడున్న 850 బార్లు, 2627 మద్యం దుకాణాలు, 50కిపైగా పబ్బులు రాష్ట్ర జనాభాకు నిక్కచ్చిగా సరిపోతాయి. అయితే కొత్త బార్లు అనుమతించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత కష్టమే…నిబంధనలు, జనాభా, విస్తీర్ణం ఇవన్నీ అడ్డుగా నిలుస్తాయి. కానీ ఇవేవీ ఇప్పుడు అడ్డుకావడంలేదు. రాష్ట్రంలో నూతన బార్లకు పేరు మార్చి మరీ ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తోంది. ప్రత్యేకంగా(డ్రింక్ ఎక్స్‌క్లూజివ్) తాగండి అంటూమరీ హడావుడి చేస్తోంది ఆబ్కారీ శాఖ. బార్ల అనుమతులకు తాజాగా వింత పద్దతిని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష జనాభాకు ఒక బార్ ఇవ్వాలని చట్టంలో ఉంది. ఈ మేరకు జనాభా ప్రాతిపదికన 850 బార్లు రాష్ట్రంలో నడుస్తున్నాయి. జనాభా పెరిగి కొత్త బార్లు ఇచ్చేందుకు ఏళ్లపాటు వేచిచూడాల్సి రావడం, మరోవైపు ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం వింతైన దాటవేతతో వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టింది. ఎలైట్ బార్ల పేరుతో కొత్త బార్లకు అనుమతులకు తలుపులు తెరిచింది.
10వేల చదరపు అడుగుల స్థలం 2వేల చదరపు అడుగులవిస్తీర్ణంలో మద్యం బాటిళ్లను కనిపించేలా డిస్‌ప్లే చేయగల సామర్ధ్యం, భవనం మొత్తం సెంట్రల్లి ఎయిర్ కండీషనింగ్, విశాలమైన పార్కింగ్ సౌకర్యంతో మీరు సిద్దంగా ఉన్నారా…అయితే ఎలైట్ బార్‌కు దరఖాస్తు చేసుకోండి…అని ప్రభుత్వం పిలుపునిస్తోంది. హెదరాబాద్ నగరంలో ఇప్పటికే మైక్రో బ్రూవరీలు నడుస్తుండగా కొత్తగా విదేశీ మద్యం, అధునాతన వంట గదితో ఆకర్శించేలా ఎలైట్ బార్ల రాకతో మద్యం ఏరులై పారనుందనే ఆందోళన వ్యక్తమవుతోండగా, విశ్వనగరంగా హైదరాబాద్‌కు ఉన్న ఖ్యాతి, విదేశీ ప్రతినిధులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఐటీ నిపుణుల కోసం ఈ మాత్రం చేస్తే కొత్తగా పోయేదేమీ లేదని ప్రభుత్వ వాదనగా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..