Wednesday, November 20, 2024

Delhi | లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ తెలంగాణను దోచుకుంటున్నాయి : రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ కలిసి తెలంగాణను దోచుకుంటున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన తెలుగులో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసులు, గిరిజనుల పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి చులకన భావన ఉందని ఆరోపించారు. అందుకే జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజున సభకు రాకుండా అవమానించారని అన్నారు.

ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రిమండలిపై ప్రజలకు విశ్వాసం పోయిందని, అందుకే తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని తెలిపారు. విభజించి పాలించు అనే బ్రిటీష్ పాలకుల విధానాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుసరిస్తోందని, మణిపూర్‌లో అదే మాదిరిగా జాతుల మధ్య విభజన తీసుకొచ్చిందని రేవంత్ మండిపడ్డారు. మణిపూర్‌లో మైతీ, కుకీ తెగల ప్రజల మధ్య ఘర్షణలకు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయే కారణమని నిందించారు.

ఘర్షణల సమయంలో మణిపూర్ వెళ్లకుండా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనే మునిగి తేలారని విమర్శించారు. ప్రధాని సభకు రాకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ప్రధానికి ఎన్నికల ప్రయోజనాలే తప్ప, ఆదివాసుల సమస్యలు పట్టడం లేదని నిందించారు. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనేలా స్పీకర్ ఆదేశించాలని రేవంత్ కోరారు. వన్ నేషన్ – వన్ పర్సన్ అనే విధానాన్ని ప్రధాని అమలు చేస్తున్నారని, బీజేపీలో సీనియర్ నేతలను ఆయన పక్కన పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఈ పదేళ్లలో అమలు చేయలేదని విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement