భారత ఆర్మీ చరిత్రలో మొదటిసారి రిక్రూట్మెంట్‌లో కుల ప్రస్తావన చోటు చేసుకుందని, అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థులు కులం కాలమ్‌ను పూర్తి చేస్తున్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ట్విట్టర్‌లో ఆరోపించారు. మోడీజీ .. అగ్నిపథ్‌తో మీరు అగ్నివీర్‌లను తయారు చేస్తున్నారా లేక జాతివీరులనా అని ఆయన ప్రశ్నించారు. ఆర్మీలో సేవలు అందించడానికి దళితులు, వెనుకబడిన కులాలు, గిరిజనులు అనర్హులా అని ఎంపీ సంజయ్ సింగ్ ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించారు. కులం కాలమ్‌తో దేశ ప్రజల ముందు ప్రధాని మోడీ ప్రభుత్వ వికృత కోణం బైట పడిందని ఎంపీ సింగ్ హిందీలో ట్వీట్ చేశారు.
పార్లమెంటులో సైతం ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు మంగళవారం ఆందోళన చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌లో కేంద్రం అభ్యర్థుల కుల వివరాలను ప్రశ్నిస్తోందని వారు ఆరోపించారు. ఆప్ ఆరోపణలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించారు. పార్లమెంటు కాంప్లెక్స్ లో మీడియాతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ ఈ రూమర్లపై దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ సిస్టమ్ స్వాతంత్య్రానికి పూర్వం ఏవిధంగా ఉందో, అదే కొనసాగుతోందని, ఎలాంటి మార్పులూ జరగలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.