హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. నల్లగొండ, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు కొద్ది మేర పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 32 డిగ్రీలపైనే నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 33.8 సెల్సియస్ డిగ్రీలు నమోదు కాగా… భద్రాచలంలో 32.8 , హన్మకొండలో 33, హైదరాబాద్‌లో 31.9, ఖమ్మంలో 34.8, మహబూబ్‌నగర్‌లో 30.8, మెదక్‌లో 32.6 డిగ్రీలు, నల్గొండలో 38 డిగ్రీలు, నిజామాబాద్‌లో 32.7 డిగ్రీలు, రామగుండంలో 33.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంతో పోలిస్తే నల్గొండలో అత్యధికంగా 4.5డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.