ప్రభ న్యూస్, హైదరాబాద్ (ప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అల్ప పీడనంగా మారడంతో హైదరాబాద్ సిటీతో పాటు పలు ఇతర నగరాలు, పట్టణాల్లోని ప్రజలు సఫరవుతున్నారు. పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆగకుండా పలుచోట్ల ముసురు ముంచెత్తడంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ట్యాంక్ బండ్, లిబర్టీ, బషీర్ బాగ్, నాంపల్లి, బేగం బజార్, లక్టీకపూల్, కోఠీ, సుల్తాన్ బజార్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో తేలిక పాటి వర్షం కురిసింది. అత్యవసరం పనుల మీద బయటకు వెళ్లిన వారు ముసురుతోపాటు, చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మూడు రోజులు వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారడంతో ఇవ్వాల (సోమవారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంవల్ల రాగల మూడు రోజులు తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో తెలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.