Saturday, November 23, 2024

సీఎం కేసీఆర్ ఆలోచన నుండి పుట్టిందే ‘కంటి వెలుగు’ : మంత్రి సత్యవతి రాథోడ్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించార‌ని, కంటి వెలుగు తరహా పథకం తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేద‌ని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న గుమ్ముడూరు ప్రభుత్వ పాఠశాలలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి.. కంటి పరీక్ష చేయించుకున్నారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కంటి చూపును నిర్లక్ష్యం చేస్తున్న వారికి చైతన్య పరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నుండి పుట్టిందే కంటి వెలుగు అన్నారు. బాధితులకు పరీక్షలు అనంతరం అక్కడికక్కడే కళ్ళజోడును అందించడమే కాకుండా అవసరమయ్యే వారికి ఆపరేషన్లకు కూడా రికమెండ్ చేసి వాటిని కూడా సంబంధిత ఆసుపత్రులలో చేయిస్తాం అన్నారు. చాలామంది తమకు చూపు తక్కువ అయిందని తెలిసి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు.. వారి కోసమే కేసీఆర్ నేరుగా గ్రామాల్లోకి వెళ్లి శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి,13వ వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న, జిల్లా కలెక్టర్ శశాంక అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ,నోడల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్యశాఖ అధికారి హరీష్ రాజు, టీఎన్జీవోస్ అధ్యక్షులు వడ్డెబోయిన శ్రీనివాస్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement