Friday, November 22, 2024

‘కంటి వెలుగు’ పేదలకు వరం : మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించి పర్యవేక్షించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించిన మంత్రి డాక్టర్లను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగును పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతకుముందు శిబిరం వద్దకు వచ్చిన జనంతో మంత్రి మాట్లాడారు. వారి యోగ క్షేమాలతో పాటు, శిబిరం వద్ద ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కండ్లద్దాలు రాసిన వారికి మంత్రి స్వయంగా అద్దాలను వారి కండ్లకు తొడిగారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం అన్నారు. రాష్ట్రంలోని అంధత్వాన్ని నిర్మూలించడానికి సీఎం కేసీఆర్‌ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకునే ప్రతి క్లస్టర్‌లో కంటి వెలుగు క్యాంపును ఏర్పాటు చేసి మందులు, నాణ్యత కలిగిన అద్దాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వైద్యులు కూడా ఓపికతో ప్రతి వ్యక్తికి పరీక్ష చేసి మందులు, అద్దాలు అందజేయాలని సూచించారు.
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ఇతర అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement