పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ నటించారు..పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు.మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ- కరీంనగర్ ప్రాంతానికి చెందిన బాలామణి (రమ్యకృష్ణ) భర్త బలరామ్ బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ షిప్ వరకూ వెళ్లి చనిపోతాడు. దాంతో తన కొడుకైన ‘లైగర్’ (విజయ్ దేవరకొండ)ను బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ గా చూడాలని బాలామణి అనుకుంటుంది. రోడ్డు పక్కన చాయ్ బండి పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తూ, కొడుకులో పట్టుదల పెంచుతూ వెళుతుంది. తన కలను నిజం చేసుకోవడం కోసం కొడుకును వెంటబెట్టుకుని ముంబై వెళుతుంది. అక్కడ క్రిస్ట్ ఫర్ (రోనీత్ రాయ్) ను రిక్వెస్ట్ చేసి అతని ట్రైనింగ్ సెంటర్ లో చేరుస్తుంది. లైగర్ కూడా తల్లి ఆశయాన్ని నిజం చేయాలనే ఆలోచనతోనే ఎదుగుతాడు. అతని ఆరాధ్య దైవం మైక్ టైసన్. ఆయన బొమ్మగల టీ షర్టునే వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఎప్పటికైనా ఆయనలా పేరు తెచ్చుకోవాలనీ.. ఆయనతో ఓ సెల్ఫీ దిగాలని కలలు కంటూ ఉంటాడు. లైగర్ లో ఆశయంతో పాటు ఆవేశం కూడా ఉందని మొదటి పరిచయంలోనే క్రిస్ట్ ఫర్ గమనిస్తాడు. కాకపోతే బాలామణి ఫ్లాష్ బ్యాక్ విని లైగర్ ను చేర్చుకుంటాడు. క్రిస్ట్ ఫర్ చెప్పిన పనులు చేస్తూ .. అతని దగ్గర లైగర్ శిక్షణ తీసుకుంటూ ఉంటాడు. మరి బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ గా విజయ్ గెలిచాడా అనేదే కథ.
విశ్లేషణ- బాక్సింగ్ కథ కదా అని పూరి హీరోను .. కథను ‘రింగ్’కి మాత్రమే పరిమితం చేయలేదు. ఆ రింగ్ దిశగా హీరో పాత్రను నడిపించిన తీరు .. శిక్షణ సమయంలో హీరోకి ఎదురైన సవాళ్లు .. అనన్యతో లవ్ .. అమ్మతో ఎమోషన్ .. గెటప్ శ్రీను కామెడీ .. అనన్య బ్రదర్ తో గొడవలు .. ఇలా నాన్ స్టాప్ ఎంటర్టయిన్మెంట్ తో ఇంటర్వెల్ ఇట్టే వచ్చేస్తుంది. లైగర్’కి హీరోయిన్ బ్రేకప్ చెప్పడమనే ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందా అనే ఆత్రుతతో సెకండాఫ్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. సెకండాఫ్ ఆరంభంలోనే సంజూపై గెలిచి లైగర్ నేషనల్ ఛాంపియన్ అవుతాడు. దాంతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ పెరిగిపోతుంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనేదే తన ఆశయమని మీడియా ముఖంగా లైగర్ చెబుతాడు. అందుకు అవసరమైన ఆర్ధిక సహాయం కూడా లభించడంతో లైగర్ టీమ్ లాస్ వేగాస్ చేరుకుంటుంది. ఇక్కడి నుంచే కథ అదుపు తప్పుతుంది. ఇది బాక్సింగ్ నేపథ్యంలోని కథ గనుక, ఎలాగైనా మైక్ టైసన్ ను తెరపై చూపించాలనే పూరి ఆలోచన తేడా కొట్టేసింది. లైగర్ రింగ్ లో ఫైట్ చేస్తుంటే మైక్ టైసన్ తో క్లాప్స్ కొట్టించినా మంచి రెస్పాన్స్ వచ్చేది. కానీ ఆయనను ఒక ప్రత్యేకమైన పాత్రలో చూపించాలనే ఉద్దేశంతో పూరి డిజైన్ చేసుకున్న పాత్ర సెట్ కాలేదు. ఫలితంగా కథ పట్టు కోల్పోయి సిల్లీగా అనిపిస్తుంది. ఏడాది పాటు కష్టపడి మైక్ టైసన్ ను పట్టుకున్నట్టు పూరి చెప్పాడు. కానీ అది కథకి ప్లస్ కాకపోగా మైనస్ అయిందనే చెప్పాలి.
నటీ నటులు – విజయ్ దేవరకొండ యాక్షన్ ఈ సినిమాకి హైలైట్. ” ఏయ్ ఏందిదీ .. మీరింత ఫాస్టుంటే రేప్పొద్దున మీకు పెళ్లిళ్లు ఎట్లయితయే” అంటూ లేడీ ఫైటర్లతో తన మార్కు డైలాగులతో అతను మెప్పించాడు. నిజమైన బాక్సర్ లా తెరపై విజృంభించాడు. “ఆడు నా కొడుకు .. ఆడెవడి మాటా ఇనడు” అంటూ మాస్ మదర్ రోల్లో రమ్యకృష్ణ గొప్పగా చేసింది. ఆ తరువాత అనన్య పాండే.. విషు రెడ్డి పాత్రలను కూడా పూరి మలిచిన తీరు బాగుంది.
టెక్నికల్స్ – సంగీతం విషయానికి వస్తే రెండు పాటలు ట్యూన్ పరంగా కొత్తగా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జునైద్ సిద్ధికీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. విష్ణు శర్మ కెమెరా పనితనానికి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. పాటలను .. ఫైట్లను తెరపై గొప్పగా ఆవిష్కరించాడు. కథాకథనాల్లో కొత్తదనం లేకపోయినా, ప్రధానమైన పాత్రలను పూరి మలిచిన విధానం .. వాటిని నడిపించిన తీరు బాగున్నాయి. మరి ఓవరాల్ గా ఈ చిత్రం ఎలా ఉందనేది ప్రేక్షకుడి అభిప్రాయం మేరకు ఆధారపడి ఉంటుంది.