అమరావతి, ఆంధ్రప్రభ: మరో పది రోజుల్లో బార్ల లైసెన్స్‌లకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త బార్ పాలసీలో భాగంగా ఆన్‌లైన్‌లో ప్రీ బిడ్డింగ్ విధానం ప్రభుత్వం అమలు చేయబోతోంది. దరఖాస్తుదారుల్లో అత్యధిక మొత్తం కోట్ చేసిన వారికే బార్ లైసెన్స్ ఇచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. అదే ప్రాంతంలోని ఇతర బార్లకు అత్యధిక మొత్తం కోట్ చేసిన హెచ్1 కంటే కొద్దిగా అటు ఇటుగా కోట్ చేస్తేనే బార్ లైసెన్స్ ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌లో ఎవరు? ఎంత మొత్తం బార్ లైసెన్స్ కోసం కోట్ చేశారు? అనేది ఇతరులకు తెలిసేలా ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పోటీదారులు అదనంగా కోట్ చేసేందుకు అవకాశం ఉంటుందనేది అధికారుల అభిప్రాయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 17న కొత్త బార్ పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలోని 840 బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు మూడేళ్ల కాలానికి కొత్త పాలసీ ప్రకటిస్తూ గెజిట్ నోటిఫి కేషన్ జారీ చేసింది. గత జూన్‌తో బార్ల లైసెన్స్ గడువు ముగియడంతో మరో రెండు నెలల పాటు పాత విధానం ప్రభుత్వం కొనసాగించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేస్తూ జనాభా ఆధారంగా గ్రామీణ, పట్టణ, మున్సిపల్ కార్పోరేషన్లలో నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును నిర్ణయించింది. ఈ మేరకు కొత్త బార్ల లైసెన్స్‌ల కోసం ప్రీ బిడ్ విధానం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అత్యధికంగా కోట్ చేసిన వారికే..
అత్యధికంగా కోట్ చేసిన వారిని హెచ్1గా ఎంపిక చేసి లైసెన్స్ కేటాయిస్తారు. బార్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని బట్టి వచ్చిన బిడ్లలో పేర్కొన్న మొత్తాల్లో ఎక్కువ కోట్ చేసిన వారికి అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఇద్దరు ఒకే మొత్తాన్ని పేర్కొంటే డ్రా తీసి ఒకరికి కేటాయించడం జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో అత్యధిక కోట్ చేసిన వారిని హెచ్1గా ఎంపిక చేయడంతో పాటు ఇతర బార్ల లైసెన్స్‌లు కూడా అదే స్థాయిలో కోట్ చేస్తే లైసెన్స్ మంజూరు చేస్తారు. కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చని చెపుతున్నారు. అంటే 10శాతం వరకు మాత్రమే తక్కువ కోట్ చేసేందుకు అనుమతించనున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరు అత్యధికంగా కోట్ చేశారనేది ఇతరులు తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. దానిని బట్టి బిడ్ మొత్తంలో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు కూడా కలిపించనున్నారు.
ఇతర ప్రాంతాల్లో కూడా..
ఒక ప్రాంతంలో బార్ లైసెన్స్ దక్కించుకున్న వారు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించనుంది. గతంలో బార్ల లైసెన్స్‌లు ఓపెన్ ఆక్షన్ విధానంలో ఒకేరోజు మంజూరు చేసేవారు. తద్వారా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రభుత్వ రాబడి తగ్గించే వారు. బిడ్డింగ్‌లో ఎవరు ఎంతకు కోట్ చేశారనేది కూడా గుట్టుగా ఉండటంతో వచ్చిన దాంట్లోనే అత్యధిక మొత్తానికి లైసెన్స్ మంజూరు చేసేవారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ మొత్తం కోట్ చేసేందుకు సిద్ధమైనా వ్యవధి లేక ఇతరులకు అవకాశం ఉండేది కాదు. ఈసారి లైసెన్సింగ్ విధానంలో ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయబోతోంది. ఒకేరోజు కాకుండా ఎంపిక చేసిన రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఆన్‌లైన్ బిడ్లను ఖరారు చేస్తారు. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో బార్ల లైసెన్స్ పొందేందుకు వ్యాపారులకు అవకాశం ఇస్తే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. తద్వారా పోటీ తత్వం పెరిగి ప్రభుత్వానికి రాబడి పెరుగుతుందని భావిస్తున్నారు.
దరఖాస్తు రుసుము ఇలా..
బార్ల కోసం చెల్లించే అప్లికేషన్ ఫీజు(నాన్ రిఫండబుల్) జనాభా ప్రాతిపదికన ఉండనుంది. 50 వేలలోపు జనాభా ఉంటే రూ. 5 లక్షలు, 50 వేల 1 నుంచి ఐదు లక్షలలోపు జనాభాకు రూ. ఏడున్నర లక్షలు, ఐదు లక్షలకుపైబడిన జనాభా ఉంటే రూ. పది లక్షల చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో లైసెన్స్ కోసం కావాల్సిన అన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆక్షన్‌లో పాల్గొనే వారు బార్ పెట్టబోయే ప్రాంతాన్ని బట్టి నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర ప్రదేశాల ప్రకారం రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.