ముంబై : అతిపెద్ద ఐపీఓ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) స్టాక్ ఎక్స్ఛేంజీలో తిప్పలు తప్పలేవు. ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చింది. లిస్టింగ్ గెయిన్స్ విషయంలో నిరాశే మిగిలింది. ప్రైస్‌బ్యాండ్ గరిష్టం రూ.949తో పోలిస్తే.. బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేర్లు 8.62 శాతం నష్టంతో రూ.867.20 వద్ద నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టు అయ్యింది. చివరికి ఇష్యూ ధర కంటే 7.75 శాతం నష్టపోయి.. రూ.875.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.918.95 వరకు వెళ్లగా.. కనిష్టంగా రూ.860.00ను తాకింది. దీంతో సాధారణ ఇన్వెస్టర్.. ఒక్కో షేర్‌పై రూ.77 లిస్టింగ్ నష్టం మూటగట్టుకున్నాడు. అయితే రూ.60 రాయితీతో రూ.889 వద్ద షేర్లను దక్కించుకున్న పాలసీదారులు, రూ.45 డిస్కౌంట్‌తో రూ.904 వద్ద షేర్లను పొందిన ఉద్యోగులు.. రిటైలర్లకు మాత్రం నష్టం కొంత తగ్గింది.
రూ.6లక్షల కోట్లుగా నమోదు..
ఎట్టకేలకు ప్రభుత్వం ఈ ఐపీఓ ద్వారా రూ.20,557 కోట్లను సమీకరించుకోగలిగింది. ఇష్యూ ధర అయిన రూ.949 వద్ద ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.6లక్షల కోట్లుగా నమోదైంది. నష్టాలతో లిస్టు కావడంతో.. ఆ విలువ రూ.5.57 లక్ష కోట్లకు పడిపోయింది. అంటే ఐపీఓలో మదుపు చేసిన మదుపర్ల సంపదలో ఒక్క రోజే రూ.42,500 కోట్లు ఆవిరయ్యాయి. గత వారం రోజులుగా మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. సోమవారం నుంచే మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. అయినా లిస్టింగ్ గెయిన్స్‌ను మాత్రం అందుకోలేకపోయాయి. సబ్ స్క్రిప్షన్‌లో దాదాపు 3 రెట్ల స్పందన లభించింది. అయినా ట్రేడింగ్‌లో మాత్రం నష్టాలు తప్పలేవు.
భవిష్యత్తులో మంచి డిమాండ్.
ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ షేర్లకు రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. మున్ముందు ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ షేర్లను కొనుగోలు చేస్తారని, దీంతో ధర కూడా పెరుగుతుందని సూచించారు. దీర్ఘ కాలం పాటు హోల్డ్ చేసుకునేవారికి మంచి లాభాలు అందిస్తాయని చెప్పుకొచ్చారు. మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత కారణంగానే.. నష్టాలు వచ్చాయని, మార్కెట్లు గాడిలోపడ్డాయని, ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
మార్కెట్ అనిశ్చితియే కారణం..
ఎల్‌ఐసీ షేర్లు నష్టాలతో లిస్టింగ్ కావడంపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. స్టాక్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితియే దీనికి కారణమని, అయితే ఊహించని పరిస్థితుల కారణంగానే షేర్లు నష్టాల్లో లిస్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే.. ఎల్‌ఐసీ లిస్టింగ్ తరువాత మాట్లాడారు. దీర్ఘ కాలికంగా వెయిట్ చేసే వారికి మంచి లాభాలు వస్తాయని, ప్రతీ ఒక్కరు షేర్లను తమ డీమ్యాట్ అకౌంట్స్‌లోనే ఉంచుకోవాలని సూచించారు. మార్కెట్ పరిస్థితులను ఎవరూ అంచనా వేయలేరని, రాయితీ ధర వద్ద షేర్లను దక్కించుకున్న పాలసీదారులు, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం కొంత రక్షణ లభించిందన్నారు.
ఐదో అతిపెద్ద కంపెనీగా..
ఎల్‌ఐసీ లిస్టింగ్‌తో ఎల్‌ఐసీ దేశంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఇప్పుడు మార్కెట్ వ్యాల్యూయేషన్ ప్రకారం.. ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.5.54 లక్షల కోట్లుగా ఉండింది. మార్కెట్ విలువ పరంగా.. హెచ్‌యూఎల్ (రూ.5.27 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.4.94 లక్షల కోట్లు), ఎస్‌బీఐ (రూ.4.17 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.3.97 లక్షల కోట్లు) కంటే ఎల్‌ఐసీ పెద్ద కంపెనీ అని బీఎస్‌ఈ డేటా వెల్లడించింది. రూ.17.12 లక్షల కోట్లతో రిలయన్స్ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అగ్ర స్థానంలో ఉండగా.. ఆ తరువాత టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..