Saturday, November 23, 2024

మేలోనే ఎల్‌ఐసీ ఐపీఓ..

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ అస్థిరత వల్ల లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఐపీఓకి గత ఆర్థిక సంవత్సరంలో రాలేకపోయింది. తాజా నివేదిక ప్రకారం ప్రభుత్వం మే నెలలో ఐపీఓకి రావచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం ఎల్‌ఐసీలో 7శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం వచ్చే నెలలో 50వేల కోట్ల అంటే 6.6డాలర్ల బిలియన్ల నిధిని సేకరించనుంది. అయితే గతంలో 5శాతం వాటా మాత్రమే విక్రయించాలని భావించినా ఇప్పుడు అది ఏడు శాతానికి పెరిగినట్లు సమాచారం. మే 12 గడువు కంటే ముందే దీన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎల్‌ఐసీ స్పందించలేదు. మే నెలాఖరు నాటికి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సద్దుమణిగి మార్కెట్‌ గాడిలో పడితే పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ఐసీ డిపాజిట్‌ చేసిన డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఎంబెడెడ్‌ విలువకు గడువు మే 12వరకు ఉంది.

అంటే మే 12నాటికి వస్తే కొత్త ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం ఉండదు. ఈ గడువు ముగిసిన తర్వాత లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ అన్ని పత్రాలను మళ్లి సమర్పించి పొందుపరిచిన విలువను కొత్తగా రూపొందించాలి. 2021-22ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ఐపీఓ తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రణాళిక. లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఐదుశాతం వాటాను విక్రయించడం ద్వారా 63వేల కోట్ల నిధిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ లక్ష్యాన్ని 1.75లక్షల కోట్లనుంచి 78వేల కోట్లకు తగ్గించింది. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ ప్రతికూలంగా ప్రభావితమవడంతో స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఐపీఓను వాయిదా వేయవలసి వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement