Saturday, November 23, 2024

ఎల్‌ఐసీ బీమా రత్న ప్లాన్.. రక్షణతో పాటు సేవింగ్స్‌..

న్యూఢిల్లి : లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఇండియా (ఎల్‌ఐసీ) సరికొత్త పాలసీని ప్రకటించింది. బీమా రత్న పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, వ్యక్తిగత, సేవింగ్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. ఈ ప్లాన్‌లో రక్షణతో పాటు సేవింగ్స్‌ కలిపి ఉంటాయి. కార్పొరేట్‌ ఏజెంట్లు, ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌ సంస్థలు, బ్రోకర్ల ద్వారా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్నవారు పాలసీ కొనసాగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. అంతేకాదు.. నామినీ కోరుకున్నట్టు నెలకోసారి, ఏడాదికోసారి చొప్పున ఆర్థికంగా మద్దతు కూడా లభిస్తుంది.

15 ఏళ్లు ఎంచుకుంటే.. 11 ఏళ్ల ప్రీమియం..

ఎల్‌ఐసీ బీమా రత్న పాలసీని కనీసం రూ.5లక్షల సమ్‌ అష్యూర్డ్ తో తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. రూ.25,000 చొప్పున ఎంతైనా పెంచుకుంటూ వెళ్లొచ్చు. పాలసీ గడువు 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు చొప్పున ఎంచుకోవచ్చు. 15 ఏళ్ల గడువు ఎంచుకుంటే.. 11 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. 21 ఏళ్ల గడువు ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. 25 ఏళ్ల గడువు ఎంచుకుంటే.. 20 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఎల్‌ఐసీ బీమా రత్న పాలసీ 15 ఏళ్ల గడువుతో తీసుకోవాలనుకుంటే.. కనీస వయస్సు 5 ఏళ్ల నుంచి గరిష్ట వయస్సు 55 ఉండాలి. 20 ఏళ్లు, 25 ఏళ్ల గడువుతో తీసుకోవాలనుకుంటే.. కనీస వయస్సు 90 రోజుల వయస్సు ఉండాలి. గరిష్ట వయస్సు 20 ఏళ్ల పాలసీకి 50 ఏళ్లు, 25 ఏళ్ల పాలసీకి 45 ఏళ్లు ఉండాలి. అంటే పాలసీ మెచ్యూరిటీ అయ్యే సమయానికి గరిష్ట వయస్సు 70 ఏళ్లు అవుతుంది.

8 ఏళ్లలోపు ఉంటే.. రెండేళ్ల తరువాత..

ఎల్‌ఐసీ బీమా రత్న పాలసీ తీసుకునే వ్యక్తి వయస్సు 8 ఏళ్లలోపు ఉంటే.. పాలసీ తీసుకున్న రెండేళ్ల తరువాత.. రిస్క్‌ కవర్‌ ప్రారంభం అవుతుంది. ఒకవేళ వయస్సు 8 ఏళ్లపైనే ఉంటే.. రిస్క్‌ కవర్‌ వెంటనే ప్రారంభం అవుతుంది. 15 ఏళ్ల పాలసీకి 13, 14వ ఏడాదిలో 25 శాతం చొప్పున, 20 ఏళ్ల పాలసీకి 18, 19వ ఏడాదిలో 25 శాతం చొప్పున, 25 ఏళ్ల పాలసీకి 23, 24వ ఏడాదిలో 25 శాతం చొప్పున బెనిఫిట్‌ లభిస్తుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement