న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మజ్లిస్ పార్టీ ఒత్తిడి వల్లే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని జరపట్లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. విమోచన దినోత్సవాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు.
విమోచన దినాన్ని ఇంటిగ్రేటెడ్ డేగా ఇప్పుడు జరుపుతున్న ప్రభుత్వం గతంలో ఎందుకు నిర్వహించలేదో చెప్పాలని కోరారు. ఇకనైనా అధికారికంగా కర్ణాటక, మహారాష్ట్రలలో నిర్వహిస్తున్నట్లే తెలంగాణలో విమోచన దినోత్సవం జరిపించాలని డిమాండ్ చేశారు. మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని అమరులైన వారి త్యాగాలను తక్కువ చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
అనంతరం ఆయన ఇండియా పేరు మార్పుపై స్పందిస్తూ భారత్‌పై చర్చ అనవసరమన్నారు. దేశపేరు మార్పు కొత్తదేమీ కాదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నదేనని చెప్పుకొచ్చారు. పేరు మార్పుపై ఊహాగానాలు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భయపడే విపక్షాలు కూటమిగా జట్టు కట్టాయని, యూపీఏ ఇండియాగా రూపాంతరం చెందిందని రామచంద్రరావు ఎద్దేవా చేశారు.