న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకే భవన్‌కు చేరుకున్నబీజేపీ కేంద్ర, రాష్ట్ర సమన్వయకర్త నూనె బాల్‌రాజ్ నేతృత్వంలో వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అమరులకు నివాళులర్పించారు.
అనంతరం బాల్‌రాజ్ మాట్లాడుతూ… తెలంగాణలో చరిత్ర పునరావృతమవుతోందన్నారు. నాడు సర్దార్ పటేల్ హైదరాబాద్‌లో నిద్ర చేస్తే నిజాంకు నిద్ర కరవైందని, ఇప్పుడు అమిత్ షా ఒక్క రాత్రి నగరంలో బస చేస్తే కేసీఆర్‌కు నిద్ర పట్టట్లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించినట్టే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అధికారం మారుతుందని జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచనల మేరకు విమోచన దినోత్సవాన్ని నిర్వహించామని ఆయన చెప్పారు.