Friday, November 22, 2024

పార్టీ నుంచి ఈటెలను సస్పెండ్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం వైస్​ ఛైర్మన్ ​బోయినపల్లి వినోద్​కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. మంగళవారం వేర్వేరుగా ఈ లేఖలను పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే ఈటెలపై విమర్శలు ఎక్కుపెట్టారు. మంత్రులతో పాటుగా వినోద్​కుమార్​ వంటి నేతల నుంచి ఈటెలకు ఎదురుదాడి మొదలైంది. అటు ఈటెల కూడా విమర్శలకు దిగుతున్నారు. అయితే ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే రసమయి ఉంటాడని ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. కారణాలేమైనా ఈటెలను టీఆర్ఎస్​ పార్టీ నుంచి బహిష్కరించాలని, వెంటనే సస్పెండ్​ చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని పార్టీ చీఫ్​ కేసీఆర్​తో పాటుగా వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు కూడా లేఖను పంపించినట్లు తెలుస్తోంది. ఈటెలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేసినా ఇంకా పార్టీనుంచి సస్పెండ్​ చేసే అంశంలో క్లారిటీ లేదు. అటు రాజీనామాకు కూడా సిద్ధమని ఈటల ప్రకటించారు. పార్టీ గుర్తుపై కాకుండా సొంతంగా మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమేనంటూ సంకేతాలిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటెలను పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్​ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement