Tuesday, November 26, 2024

మహనీయుల జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేద్దాం : మంత్రి గంగుల

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని, ఉత్సవాలను పండుగలా జరుపుకునేందుకు సంఘాలన్నీ సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నేడు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, అంబేద్కర్ సంఘాల, దళిత సంఘాల నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ నెల 5వ తేదీన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతి కోసమే కాకుండా, వారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన మహనీయులని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కు వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. భావితరాలకు ఈ మహనీయుల జీవిత చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వారు చూపిన దారి మన అందరికీ అనుసరణీయమని తెలిపారు. దళితులకు జరిగే అన్యాయం పై మాత్రమే చర్చ జరగాలన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉత్సవాలను ఉదయమే ప్రారంభించుకోవాలని అన్నారు. ఉత్సవ వేదికల వద్ద షామియానాలు, తాగునీరు, సరిపడా కూలర్ల ను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement