Friday, November 22, 2024

పల్లె ప్రగతి పవర్‌ని ప్రపంచానికి చాటుదాం.. అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దిశానిర్దేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న పల్లె ప్రగతి పవర్‌ని ప్రపంచానికి చాటుదామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పిలుపునిచ్చారు. సిఎం కేసీఆర్‌ రూపొందించి అమలుచేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం వలన దేశానికే తెలంగాణ గ్రామాలే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఓడిఎఫ్‌, ఈ పంచాయతీ, ఆడిటింగ్‌లోనూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పని చేయడం వలన గ్రామాల్లో జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యచరణ ప్రణాళికపై అన్ని జిల్లాల డిపివోలు, డిఆర్డీవోలతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. ఈ సందర్భంగా డిపివోలకు ల్యాప్‌టాప్‌లు, డిఆర్డీవోలకు మొబైల్‌ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ శరత్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి నాలుగు విడతల స్ఫూర్తిని కొనసాగిస్తూ ఐదో విడత కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 7 శాతం గ్రీన్‌ కవర్‌ పెరిగిందని,అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలను నాటాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ సరఫరా సంబంధిత సమస్యలు , వంగిపోయిన స్తంభాలు, వదులుగా ఉన్న విద్యుత్‌ తీగలను సరిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాల్లో పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. డంపింగ్‌ యార్డులు, తడి చెత్త నుంచి కంపోస్టు తయారు చేయాలన్నారు. పొడి చెత్త కొనుగోలు కోసం దగ్గరలో ఉన్న ఏజెన్సీ ట్రేడర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. వైకుంఠధామాలకు నీరు, విద్యుత్‌ సౌకర్యాలతో పాటు మరుగుదొడ్లు, గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి డిపివోలు, డిఆర్డీవోలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. గ్రామ కార్యదర్శులు తప్పనిసరిగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు గ్రామాల్లో ఉండాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement