భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు కొనసాగుతోంది. ఈ రంగంలో ఇప్పటికే దాదాపు వంద అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. ఉపగ్రహాల తయారీ, డిజైనింగ్, ప్రయోగ వాహక నౌకల రూపకల్పన, కక్ష్యల్లో ఇంధనం నింపే యంత్రాల తయారీలో విశేష సేవలందిస్తున్నాయి. అయితే, వాటి జోరుకు తగిన ప్రోత్సాహం లభించడం లేదు. ప్రత్యేకించి ఆర్థిక, బీమా సౌకర్యాల విషయంలో మరింత సౌలభ్యం, వెసులుబాటు కల్పిస్తూ కొత్త స్పేస్ పాలసీ రావాలని ఆయా అంకుర సంస్థలుకోరుకుంటున్నాయి. అనుకోని సంఘటనలు జరిగితే ఎదురయ్యే పరిణామాలపై స్పష్టత కావాలని కోరుతున్నాయి. కాగా ఇదే విషయంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. అంతరక్షి కార్యక్రమాలకు సంబంధించి కొత్త విధానాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతిరక్ష రంగంలో ప్రైవేటీకరణకు చొరవ తీసుకున్న నేపథ్యంలో మంచి శకునాలే ఎదురయ్యాయి. భారతీయ స్పేస్ సెక్టార్‌కు చెందిన రెండు దేశీయ స్టార్టప్ సంస్థలు ఒక ఉపగ్రహాన్ని తయారు చేశాయి. టాటా ప్లే, ఇస్రో ఆ ఉపగ్రహాన్ని తయారు చేయాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. జూన్‌లో ఆ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు కూడా. అంతిరక్ష రంగంలో మార్కెట్ విస్తృతంగా ఉంది.
మాకు మూడు ఆర్డర్లు ఉన్నాయి. ఉపగ్రహాల తయారీ, ప్రయోగ వాహక నౌకల తయారీ, కస్టమర్లు కోరిన చోటికి వాటి తరలింపు వంటి సేవలు అందించబోతున్నామని ధృవ స్పేస్ స్టార్టప్ సీఈఓ సంజయ్ నెక్కంటి తెలిపారు. తాము తయారు చేసిన శాటిలైట్ ఆర్బిటల్ డిప్లోయర్‌ను జూన్ 30న పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సందర్భంగా పరీక్షించారు. తద్వారా థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 అనే ఉపగ్రహాలను ఈ ఏడాది చివర్లో ప్రయోగించేందుకు ధృవస్పేస్ తమ సమర్థతను పరీక్షించుకుందని ఆయన చెప్పారు. కాగా 2021-22లో భారత్ స్పేస్ ఎకానమీ 5 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంచనావేసింది. కాగా ఇక ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ముందుకు రావాల్సి ఉందని డైరక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ లెఫ్టినెంట్ జనరల్ ఎ.కె.భట్ అభిప్రాయపడ్డారు. సులభతర రుణాలు, పన్ను మినహాయింపులు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా అంతరిక్ష రంగం అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. .
తాము తయారు చేసే ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష పరికరాలపై ప్రయోజనాలపైన, యాజమాన్య హక్కులపైన స్పష్టత ఇచ్చేలా కొత్త స్పేస్ పాలసీ రావాలని మనస్తు స్పేస్ స్టార్టప్ కోరుతోంది. ఈ సంస్థ ఉపగ్రహాల ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను తయారు చేస్తూంటుంది. అలాగే, ఒకవేళ ఉపగ్రహాల ప్రయోగం విఫలమైనప్పుడు, అవి ధ్వంసమైనప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, జరీమానాలు ఏ స్థాయిలో ఉంటాయన్నదానిపై స్పష్టత అవసరమని మనస్తు స్పేస్ సీఈఓ తుషార్ జాధవ్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులపైన, ఇస్రో వేదికను ఉపయోగించడంపైన, ట్రాయ్ వంటి సంస్థల నియంత్రణపైన మరింత స్పష్టత కావాలని ఆయన అన్నారు. ఇండియన్ నేషలన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ప్రాసెసింగ్ విధఘానం పారదర్శకంగా, సమర్థవంతంగా, నిర్ణీత కాలపరిమితికి లోబడి ఉండాలని కోరారు. స్కైరూట్ స్టార్టప్‌కు చెందిన చందన కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక బీమా పాలసీలు అవసరమని అభిప్రాయపడ్డారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా వంటి సంస్థలు అంతరిక్ష రంగంలోని స్టార్టప్‌లకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని వీరు ఉదహరిస్తున్నారు. ఇస్రోకూడా అదే విధానంలో సహకరిస్తే అద్భుతాలు జరుగుతాయని జాధవ్ ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.