న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా పని చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వెల్లడించారు. బుధవారం సాయంత్రం జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే ఇన్నాళ్లకు కుదిరిందని సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల కంటే ముందు తమ పిల్లల చదువుల గురించి రాహుల్ అడిగారని వెల్లడించారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలతో రాజకీయం చేస్తున్నాయని, టీఆరెస్ పార్టీతో పాటు మొత్తం ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తామని జగ్గారెడ్డి తెలిపారు.
మొన్నటి సమావేశంలో ఇచ్చిన సందేశం మేరకు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళతామని స్పష్టం చేశారు. మనం, మన కుటుంబమంటే ప్రజలు, దేశం అన్నట్టుగా తామంతా కలిసికట్టుగా పని చేస్తామని పునరుద్ధాటించారు. బహిరంగ విమర్శలు ఇకపై ఉండవని, మీరు కూడా చూడరని ఆయన జోస్యం చెప్పారు. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవన్నారు. కేసీ వేణుగోపాల్, మాణిక్యం టాగోర్‌తో కూడా పార్టీ అంశాల గురించి చర్చించానని జగ్గారెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..