న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా చూడాలని, ఈ క్రమంలో 2014 తరహాలో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగుదామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెద్దలతో మరోసారి చెప్పినట్టు తెలిసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సమావేశం కోసం సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండి, బీజేపీ పెద్దలను కలిశారు. ఉదయం కేంద్ర మంత్రి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వి. మురళీధరన్‌ను ఆయన నివాసంలో కలిశారు.
అల్పాహార విందు అనంతరం కాసేపు ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం మళ్లీ తామున్న హోటల్‌కు తిరిగొచ్చిన నేతలిద్దరూ సాయంత్రం వరకు హోటల్ గదికే పరిమితం అయ్యారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణ రాజు సహా మరికొందరు ఢిల్లీలోని ప్రముఖులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున రఘురామకృష్ణ రాజు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే రాత్రి గం. 7.30 సమయంలో పవన్ కళ్యాణ్ విజయవాడకు తిరుగుప్రయాణం అయ్యారంటూ తొలుత జనసేన వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఆ కాసేపటికే నాదెండ్ల మనోహర్‌తో పాటుగా పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ఆయన కార్యాలయం (నార్త్ బ్లాక్)లో కలిశారు. అనంతరం పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా అమిత్ షాను కలిసిన ఫొటోలను విడుదల చేశారు. అలాగే ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్తును నిర్దేశించే నిర్మాణాత్మకంగా, నిర్ణయాత్మకంగా జరిగిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ గతంలో ఢిల్లీకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం రాయబారం నడిపేందుకే వచ్చారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అది నిజమే అంటూ ఆయన మీడియా కెమేరాల సాక్షిగానే వెల్లడించారు. ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్సీపీని గద్దె దించాలని, ఇందు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని అన్నారు. ఈ మధ్యకాలంలో అనేక వేదికలపై తెలుగుదేశంతో కలిసి సాగాలాన్న తన ఆకాంక్షను, అభిమతాన్ని చాటుతూనే వచ్చారు. తాజా పర్యటనలోనూ ఎన్డీయే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇదే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఎన్డీయే సమావేశంలో ఏపీ అంశాల గురించి లోతుగా మాట్లాడే అవకాశం లభించలేదని, బుధవారం ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి మాట్లాడతానని వెల్లడించారు. అన్నట్టుగానే బుధవారం రాత్రి కేంద్ర హోమంత్రి అమిత్ షా ను కలిసినప్పుడు ఈ విషయాన్ని మరోసారి లేవనెత్తినట్టు తెలిసింది.
సమదూరం.. సముచితం
ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం లభించనంత సంపూర్ణ మద్ధతు ఆంధ్రప్రదేశ్ నుంచి లభిస్తోంది. అనేక కీలక బిల్లులను ఆమోదించే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బీజేపీకే మద్దతిచ్చాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం నూటికి నూరు శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థులకే అనుకూలంగా పడ్డాయి. ఇలాంటి స్థితిలో తాను ఏ ఒక్క పార్టీకి దగ్గరై, మరో పార్టీని దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే పాత మిత్రులను కలుపుకుంటూ ఎన్డీఏ సమావేశాన్ని నిర్వహించిన కమలనాథులు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆహ్వనం పంపలేదు. నిజానికి బీజేపీతో చెలిమి కోసం ఆ పార్టీ ఎదురుచూస్తున్నప్పటికీ, స్నేహ హస్తం అందించేందుకు సుముఖత ప్రదర్శించలేదు.
చిన్న పార్టీలు.. చింతలేని కూటమి
మరో వ్యూహం ప్రకారం బలమైన ప్రాంతీయ పార్టీలతో కంటే చిన్న పార్టీలతోనే స్నేహానికి, పొత్తులకు బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది. ఎన్డీఏ భేటీకి హాజరైన 38 రాజకీయ పార్టీలో దాదాపు 24 పార్టీలకు పార్లమెంటులో ప్రాతినిథ్యమే లేదంటే ఆ పార్టీలు ఎంత చిన్నవో అర్థమవుతోంది. చట్ట సభల్లో సభ్యుల సంఖ్యాబలం కంటే ఆ పార్టీల ఓటుబ్యాంకునే బీజేపీ పరిగణలోకి తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలుపొందలేదు. ఆ పార్టీ తరఫున గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా అధికారపక్షంలో చేరిపోయినప్పటికీ, సాంకేతికంగా ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పుకోవచ్చు.
అయితే ఎన్నికల్లో 6 శాతం కంటే ఎక్కువ ఓట్లను జనసేన ఒంటరిగా సాధించగలిగింది. ఎన్నికల్లో చాలా చోట్ల అభ్యర్థుల గెలుపోటములను 1-2 శాతం ఓట్లే తలకిందులు చేస్తున్న ఈ రోజుల్లో 6 శాతం ఓట్లు తక్కువేమీ కాదు. అవి ఏ పార్టీకి అదనంగా వచ్చి చేరినా సరే వారి తలరాతే మారిపోవచ్చు. ఈసారి జనసేన ఓటు శాతం మరింత పెరుగుతుందని, ముఖ్యంగా ‘కాపు’ సామాజిక వర్గం ఓట్లు ఏకీకృతమైతే జనసేన బలం 15 శాతం దాటినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ఈ తరహాలోనే అనేక రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు ఎంపీలు లేనప్పటికీ, కొన్ని సామాజిక వర్గాల్లో గట్టి పట్టును కలిగి ఉన్నాయి. దళితులు, గిరిజన-ఆదీవాసీలు, ఓబీసీ కులాల్లో ఒక్కో కులానికి ఒక్కో పార్టీ అన్న చందంగా ఉత్తరాదిన పార్టీలున్నాయి. అలాంటి చిన్నపార్టీలను కలుపుకోవడం వల్ల ఇటు బీజేపీకి, అటు ఆ చిన్న పార్టీకి కూడా ప్రయోజనం కలుగుతుంది. చట్టసభల్లో ప్రాతినిథ్యంతో పాటు సమీకరణాలు తోడైతే మంత్రి పదవి కూడా దక్కుతుంది. తద్వారా తాము ప్రాతినిథ్యం వహించే సామాజికవర్గాలకు రాజ్యాధికారం ద్వారా చేయగలిగిందేమైనా ఉంటే చేసుకోవచ్చు.
అందుకే పైకి చిన్న పార్టీలు, తోక పార్టీలు అంటూ ఎన్డీఏ మిత్రపక్షాలను చూసి ‘ఇండియా’ కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నప్పటికీ, ఈ కూటమి లెక్కలు ఉభయ ప్రయోజనకారిగా కనిపిస్తున్నాయి. పైగా ఎన్నికల సమయంలో పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలోనూ బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలతో పోల్చుకునే చిన్న పార్టీలతో పెద్ద సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఈ సమీకరణాలు, లెక్కల నేపథ్యంలోనే బీజేపీ తెలుగుదేశం, అకాలీదళ్ వంటి బలమైన ప్రాంతీయపార్టీలకు బదులు చిన్న పార్టీలతోనే చెట్టపట్టాలేసుకోడానికి ఆసక్తి చూపుతోందన్న విశ్లేషణలు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.