ప్రజా గళం వినిపిస్తూనే ఉంటాం
కశ్మీర్ లో గెలుపు ఆత్మగౌరవానికి దక్కిన గౌరవం
హర్యానా ఓటమిపై విశ్లేషణ చేస్తున్నాం
ఎన్నికల ఫలితాలపై రాహుల్ ట్విట్
న్యూఢిల్లీ – హర్యానా ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో హర్యానాలో పరాజయంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ఈ అనూహ్య ఫలితాలను తాము విశ్లేషిస్తున్నామన్నారు. ఈమేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇక, జమ్మూకశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఆత్మ గౌరవానికి దక్కిన విజయం అని అన్నారు. ఇక, హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషణ చేస్తున్నాం.. చాలా అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి.. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
హర్యానాలో పార్టీ కోసం నిరంతరం పని చేసిన ప్రతి ఒక్కరికీ రాహుల్ ధన్యవాదాలు చెప్పారు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల గళాన్ని తాము వినిపిస్తూనే ఉంటామని రాహుల్ వెల్లడించారు.