మాపై రష్యా దాడులు ఉధృతం చేసింది.. తూర్పున డాన్‌బాస్‌పై చాలాపెద్దసంఖ్యలో రష్యా సైనిక బలగాలు జొరబడి పెనుదాడులు చేస్తున్నాయి. కీవ్ సహా అనేక నగరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి… ఎందరు సైనికులు వచ్చినా తలవంచబోం.. రష్యాతో యుద్దం రెండో దశకు చేరుకుంది. బలమైన శత్రువును మా మెరికల్లాంటి కొద్దిపాటి సైనికులు ఎదురొడ్డుతున్నారు.. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.. రష్యా హెచ్చరికలు లెక్కచేయం.. ఎవరూ లొంగిపోరు.. మా నేలను కాపాడుకునేందుకు కడదాకా పోరాడుతాం… అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మారియపోల్‌లో పూర్తిస్థాయి పట్టు సాధించిన రష్యా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని అనేక నగరాలపై మంగళవారం దాడులు ముమ్మరం చేసింది. పెద్దఎత్తున బలగాలను మోహరించింది. సోమవారంనాడు మరోసారి లెవివ్ నగరంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సురక్షిత, లేదా ప్రమాదకరమైన ప్రాంతాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేని పరిస్థితి నెలకొందని లెవివ్ మేయర్ అండ్రియ్ ఇవనోవిచ్ సడోవియి ఆవేదన వ్యక్తం చేశారు. ఖార్ఖీవ్, డానెట్స్క్, ద్నిప్రొపెట్రోవస్క్ , పోర్ట్ సిటీ మికోలయివ్‌లపై సోమవారం రాత్రినుంచి రష్యా విరుచుకుపడుతోంది.
తిప్పికొట్టాం: ఉక్రెయిన్..
రష్యాపై ఎదురుదాడులు ఉధృతంగా చేస్తున్నామని, డానెట్స్క్, లుషాంక్, ఖార్కీవ్ ప్రాంతాల్లో జొరబడేందుకు మంగళవారం ఉదయంనుంచి పెద్దఎత్తున రష్యా బలగాలు ప్రయత్నించాయని, కానీ ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకోబోమని, తమ దళాలు శత్రువు ప్రయత్నాలను తిప్పికొట్టాయని ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి ఒలెక్సీయ్ దనిలోవ్ వెల్లడించారు. క్రెమిన్నాతోపాటు మరో చిన్న పట్టణాల్లోకి మాత్రమే వారు చేరుకోగలిగారని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..