Friday, November 22, 2024

తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటాం.. రైతులెవరూ ఆందోళన చెందొద్దు: సీఎం కేసీఆర్‌

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: రాష్ట్రంలో అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ రైతాంగానికి భరోసానిచ్చారు. బుధవారం ప్రగతిభవన్‌లో పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వరిధాన్య సేకరణపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని సీఎం కేసిఆర్‌ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై సీఎం కేసిఆర్‌ ఆరా తీసారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం 56 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని సేకరించామని అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నదని, తడిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చైన రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా, కొనకున్నా బాయిల్డ్‌ రైస్‌ను ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్‌ మరోసారీ స్పష్టం చేశారు.

తెలంగాణ గ్రామీణక్రీడా ప్రాంగణాల ఏర్పాటు…

భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో ”తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం” ఏర్పాటు చేయాలని సీఎం కేసిఆర్‌ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ”గ్రామీణ క్రీడా కమీటీల”ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. జూన్‌ 2 రాష్ట్ర అవిర్భావ దినోత్సవం నాడు ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

- Advertisement -

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2 కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలుండాలని అన్నారు. ఈ ప్రసంగాలను జిల్లా కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారు చేయాలన్నారు. వేసవి ఎండల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు ప్రారంభించి, త్వరగా ముగించాలన్నారు. సాయంత్రం పూట జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని అన్నారు. ఎప్పటి వలెనే #హదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలన్నారు.

దశలవారీగా దళితబంధు….

ఈ ఏడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. దళితబంధు పథకం అమలులో మరింత వేగం పెంచాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

అధ్యక్షునికి అభినందన….

ఆసియా ఖండంలోనే తొలిసారిగా ఐఎస్‌టీఏ(అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం) ప్రెసిడెంట్‌గా భాత్యతలు స్వీకరించిన సంధర్భంగా.. తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. కె కేశవులును ప్రగతి భవన్‌లో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమని ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement