Tuesday, November 26, 2024

అదనంగా కొంటాం.. ఎంతనేది రెండ్రోజుల్లో చెబుతాం: పీయూష్ గోయల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి వరి, బియ్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందని, కనీస మద్దతు ధర కూడా గణనీయంగా పెరిగిందని, రాష్ట్ర రైతులకు నాలుగు నుంచి ఐదు రెట్ల ప్రయోజనం చేకూరిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర తెలంగాణా బీజేపీ నేతలతో కలిసి పీయూష్ గోయల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతేడాది రబీ సీజన్‌లో తెలంగాణ రైతులు పండించిన బియ్యం, వరి అంగీకరించిన పరిమాణాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎఫ్‌సీఐ గోడౌన్లకు 27 లక్షల టన్నులను పంపిణీ చేయాల్సి ఉందని, ఇందులో సుమారు 14 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం, 13 లక్షల టన్నుల ముడి బియ్యం ఉన్నాయని చెప్పారు. దేశానికి అదనపు పరిమాణం అవసరం లేకపోయినా తెలంగాణ రైతుల పట్ల ప్రత్యేక గౌరవంతో గతేడాది రబీ సీజన్‌లో వారు పండించిన 20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ బియ్యాన్ని సేకరించడానికి కేంద్రం అంగీకరించిందని పీయూష్ గోయల్ తెలిపారు. బియ్యం పంపిణీ కోసం కేంద్రం పదేపదే రాష్ట్ర ప్రభుత్వానికి పొడిగింపులు కూడా ఇచ్చిందని అన్నారు. ఎఫ్‌సీఐ నాలుగు సంవత్సరాల పాటు డిమాండ్‌ను తీర్చడానికి తగినంత నిల్వలను కలిగి ఉందని, సెంట్రల్ పూల్ కోసం ఎఫ్‌సీఐ బియ్యం కొనుగోలు చేయడం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని రాష్ట్రంతో చేసుకున్న ఎంఒయు స్పష్టంగా చెబుతోందన్నారు. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 4, 2021 నాటి లేఖలో రాష్ట్రం భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి పారా బాయిల్డ్ బియ్యం పంపిణీ చేయదని లిఖిత పూర్వక హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. డిమాండ్ ఉన్న రకం బియ్యాన్ని ఇవ్వమని చెబుతున్నామని, ఎంత ముడి బియ్యం ఇచ్చినా మేము తీసుకుంటామని ఆయన తెలిపారు. బలవంతంగా లెటర్ రాయించుకున్నామన్న మాట నిజం కాదని పీయూష్ గోయల్ చెప్పారు.

ముడి బియ్యం కొనుగోలులో ఎలాంటి సమస్య లేదని, ఎఫ్‌సీఐ రాష్ట్రం నుంచి కొనుగోళ్లను గణనీయంగా పెంచిందని మంత్రి తెలిపారు. తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన చెప్పారు. ఒప్పందం ప్రకారం తెలంగాణలో గత ఏడాది రబీ సీజన్‌లో పండించిన అంగీకరించిన పరిమాణాన్ని తెలంగాణ ప్రభుత్వం త్వరగా సరఫరా చేయాలని, రాష్ట్రంలోని రైతులను తప్పుదోవ పట్టించరాదని ఆయన స్పష్టం చేశారు. ర్యాక్‌లు, స్టోరేజీ స్థలం లభ్యత గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. అటువంటి సమస్య ఏదీ లేదని, దారుణమైన ఆరోపణలు చేయడానికి బదులుగా రాష్ట్రం అంగీకరించిన పరిమాణంలో ధాన్యాన్ని సరఫరా చేయాలని హితవు పలికారు. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ తెలంగాణ రైతులతో, తెలంగాణ ప్రజలతో ఉంటుందని, వారి సంక్షేమం కోసం అన్ని వేళలా చర్యలు తీసుకుంటుందని నొక్కి చెప్పారు..

కొన్ని గణాంకాలు చెబితే తెలంగాణా ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తుందో తెలుస్తుందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఇప్పటి వరకు రబీ టార్గెట్ అందించలేకపోయారని, నాలుగు సార్లు గడువు పొడిగించినా ఇవ్వలేకపోయారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధాన్యం వ్యవహారాన్ని రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ విమర్శించారు. తమ మీద చేసిన వ్యాఖ్యలు, నిందలను ఖండిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం… వారికేం పని లేదా వచ్చి ఇక్కడ కూర్చోవడానికని తెలంగాణా మంత్రులను ఉద్దేశించి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈటల గెలుపుతో వారికేం చేయాలో అర్థం కాక మాట్లాడుతున్నారమని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం కేసీఆర్ నిస్పృహలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు లేని సమస్యను సృష్టించారని ఆరోపించారు.

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణా ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. మీ చేతగానితనం వల్ల గత రబీ టార్గెట్ పూర్తి చేయలేదని విమర్శించారు. భవిష్యత్‌లో ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసిచ్చిందని గుర్తు చేశారు. ధాన్యం సేకరణ మొత్తం ఖర్చు కేంద్రానిదేనని చెప్పారు. కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత కేసీఆర్ బియ్యం అంశాన్ని ఎత్తుకున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రబీ నడుస్తోంది, ఖరీఫ్ బియ్యం సేకరణ వచ్చే జనవరి నుంచి ప్రారంభమవుతోంది చెప్పారు. రబీ, ఖరీఫ్‌లో ఎంత ముడి బియ్యం ఇచ్చినా తీసుకుంటామని ఆయన నొక్కి చెప్పారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి అదనంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉప్పుడు బియ్యం విషయంలో రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement